Share News

వీరి ఇళ్లు ఎప్పుడో?

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:44 PM

టిడ్కో ఇళ్ల నిర్మాణం తమ గొప్పతనమే అని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు లబ్ధిదారులకు తీరని ఆవేదనను మిగిలిస్తోంది. ఇప్పటికీ ఇళ్లను అప్పగించకపోగా.. వారు జమ చేసిన డబ్బులు కూడా తిరిగి చెల్లించడం లేదు. దీంతో పేదలు లబోదిబో మంటున్నారు.

వీరి ఇళ్లు ఎప్పుడో?
అడ్డాపుశీల వద్ద నిర్మాణంలో ఉన్న రూ.500లు చెల్లించిన లబ్ధిదారుల ఇళ్లు

నెరవేరని సొంతింటి కల

రూ.500 చెల్లించిన వారి గృహ నిర్మాణాలే ఇంకా సాగుతున్న వైనం

రూ.25వేలు, రూ.50 వేలు జమ చేసిన వారి ఇళ్ల పనులు ప్రారంభించేదెప్పుడో..

ఏళ్లు గడుస్తున్నా.. డబ్బులూ చెల్లించని వైనం

అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు

ఎన్నికలకు సమీపిస్తున్న సమయం

పట్టించుకోని సర్కారు

(పార్వతీపురం టౌన్‌, ఫిబ్రవరి 20)

టిడ్కో ఇళ్ల నిర్మాణం తమ గొప్పతనమే అని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు లబ్ధిదారులకు తీరని ఆవేదనను మిగిలిస్తోంది. ఇప్పటికీ ఇళ్లను అప్పగించకపోగా.. వారు జమ చేసిన డబ్బులు కూడా తిరిగి చెల్లించడం లేదు. దీంతో పేదలు లబోదిబో మంటున్నారు. వాస్తవంగా గత నాలుగున్నరేళ్ల నుంచి వాటి ఊసెత్తని ప్రభుత్వం.. ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడ్కో ఇళ్ల పంపిణీపై దృష్టి సారించింది. దీంతో అధికారులను పరుగులెత్తిస్తోంది. జిల్లాకేంద్రం విషయానికొస్తే.. రూ.500 చెల్లించిన లబ్ధిదారుల గృహ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. వాటి ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మౌలిక వసతుల సంగతిని మాత్రం అధికారులు మరిచారు. రోడ్లు, కాలువలు, విద్యుత్‌, తాగునీరు వంటి సదుపాయాలు లేకుండా అక్కడెలా ఉండగలమని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా టిడ్కో ఇళ్ల కోసం అప్పులు చేసి మరీ రూ. 25 వేల నుంచి 50 వేల వరకు చెల్లించిన మధ్యతరగతి వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి ఇళ్ల నిర్మాణాలను ఇంతవరకు ప్రారంభించలేదు. కనీసం వారు కట్టిన డబ్బులు కూడా చెల్లించలేదు. ఏళ్లు గడుస్తున్నా... అతీగతీ లేకపోవడంతో ఆయా లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రూ.500 చెల్లించిన లబ్ధిదారుల గృహనిర్మాణాలు ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. తమ పరిస్థితేమిటని వారు సర్కారును ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామం వద్ద పనులు ప్రారంభించారు. పట్టణంలోని 30 వార్డుల్లో ఉన్న పేద కుటుంబాలకు చెందిన 768 మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.500 చొప్పున లబ్ధిదారుల వాటాగా గృహ నిర్మాణశాఖ అధికారులు కట్టించుకున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన 240 మందితో రూ. 25వేలు, 382 మందితో రూ. 50 వేలు చొప్పున మున్సిపల్‌ కమిషనర్‌ ఖాతాలో జమచేయించారు. ఆ తర్వాత గృహ నిర్మాణాలకు అడుగులు పడ్డాయి. ఇంతలో ఎన్నికలు జరగడం.. వైసీపీ పాలన పగ్గాలు చేపట్టడంతో సీన్‌ మారింది. రూ.25 వేలు, రూ.50 వేలు చెల్లించిన మధ్య తరగతి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు మాత్రం బ్రేక్‌ పడింది. రూ.500 చెల్లించిన లబ్ధిదారుల గృహ నిర్మాణాలు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత ప్రారంభానికి సిద్ధమవుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.2.30 కోట్లు ఏమయ్యాయి?

టిడ్కో ఇళ్ల కోసం మధ్యతరగతి ప్రజలు చెల్లించిన రూ.25 వేల నుంచి రూ.50 వేలు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాతాలో ఉన్నాయా..లేవా...అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలోని 30 వార్డుల్లో 364 అడుగుల చదరపు విస్తీర్ణానికి సంబంధించి రూ. 25 వేలు చెల్లించిన వారు 240 మంది ఉన్నారు. 430 అడుగుల విస్తీర్ణానికి సంబంధించి రూ. 50 వేలు చెల్లించిన వారు 382 మంది ఉన్నారు. వారంతా ఇళ్ల కోసం సుమారు రూ. 2.30 కోట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాతాలో జమ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం తమ సొంతింటి కలను నెరవేరుస్తుందని వేచి చూసిన వారికి నిరాశే ఎదురైంది. రూ.500లు చెల్లించిన లబ్ధిదారుల టిడ్కో ఇళ్లు పూర్తి అవుతుండడంతో రూ. 25వేలు, రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో తమ గృహాల నిర్మాణం జరిగేనా అని వారు మథనపడుతున్నారు. ఇప్పటివరకు ఆ పనులేవీ చేపట్టనందున తాము కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ సింహచలంను వివరణ కోరగా రూ.25 వేలు, రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు.

ప్రభుత్వం స్పందించాలి

సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో టిడ్కో ఇంటి కోసం రూ. 25 వేల వరకు ప్రభుత్వానికి డిపాజిట్‌ చేశాం. అయితే ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు గృహ నిర్మాణాలు చేపట్టడం లేదు. మా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేయడం తగదు. దీనిపై వైసీపీ సర్కారు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.

- పి.సత్యనారాయణ, టిడ్కో లబ్ధిదారుడు, పార్వతీపురం

=====================================

న్యాయం చేయాలి..

సొంతింటి కల నెరవేరుతుందని అప్పులు చేసి రూ.25 వేల వరకు ప్రభుత్వానికి చెల్లించాం. అయితే ఇంతవరకు టిడ్కో ఇల్లు లేదు.. కట్టిన డబ్బులూ లేవు. మేము చెల్లించిన డబ్బులు కమిషనర్‌ ఖాతాలో ఉన్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారే తప్పా మాకు ఇవ్వడం లేదు. మాకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలి.

- జి.రాజశేఖర్‌, టిడ్కో లబ్ధిదారుడు, పార్వతీపురం

Updated Date - Feb 20 , 2024 | 11:44 PM