Share News

సాలూరులో కొలువుదీరేదెవరో?

ABN , Publish Date - May 31 , 2024 | 11:23 PM

ఈ సారి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి నెలకొంది. ఎవరి గెలుస్తారన్న దానిపై శ్రేణులు, ప్రజల్లో తీవ్ర నెలకొంది. ఇప్పటికే ఎవరి లెక్కల్లో వారున్నారు. పందాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి.

సాలూరులో  కొలువుదీరేదెవరో?
సాలూరు నియోజకవర్గ మ్యాప్‌

ఇద్దరు అభ్యర్థుల్లోనూ ధీమా

గెలుపోటములపై సర్వత్రా చర్చలు

శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ

నోటా ఓట్లు ఎవరికి ముప్పో?

సాలూరు రూరల్‌, మే 31: సాలూరులో విజేత ఎవరు? ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ సారి ఆ పార్టీ జెండా ఎగురుతుందా? కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పగ్గాలు చేపడతారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. టీడీపీ ఏర్పడిన తర్వాత 1989 మినహా 2004 వరకు టీడీపీ అభ్యర్థులు (బోయిన రాజయ్య, భంజ్‌దేవ్‌) వరుసగా ఇక్కడ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాజన్నదొర వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. అంతకముందు 2006లో కోర్టు తీర్పు ద్వారా ఎమ్మెల్యేగా ఆయన ఎంపిక కాబడ్డారు. అయితే ఈ సారి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి నెలకొంది. ఎవరి గెలుస్తారన్న దానిపై శ్రేణులు, ప్రజల్లో తీవ్ర నెలకొంది. ఇప్పటికే ఎవరి లెక్కల్లో వారున్నారు. పందాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి. సుమారు 17 సంత్సరాల తర్వాత సాలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురు తుందా? లేక ఐదోసారి రాజన్నదొర ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడతారా? అన్నది మరో మూడు రోజుల్లో తేలి పోనుంది. అయితే ఇరుపార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగలమని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

సాలూరులో పోలింగ్‌ తదుపరి ఓటరు నాడిని ఎవరు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. పలు సర్వేల ఫలితాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. కొన్ని టీడీపీకి, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు టీడీపీ, వైసీపీ నేతలు పోలింగ్‌స్టేషన్‌ వారీగా, మండలాలా వారీగా ఓటింగ్‌పై అంచనాలు వేసుకుంటున్నారు. తమకే అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఎవరికి వారు చెబుతున్నప్పటికీ ఏదో మూల కాసింత సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు, మేనిఫెస్టో, వైసీపీ పాలనపై ప్రజావ్యతిరేకత వల్ల టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. వైసీపీ సర్కారు సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆ పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. ఏదేమైనా సాలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంంధించి ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో సాలూరు పట్టణం టీడీపీ అనుకూలంగా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలు టీడీపీ నాయకుల్లా పనిచేయకపోవడం, ఆది నుంచి సాలూరు పట్టణం ఆ పార్టీ అనుకూలంగా ఉండడం దీనికి కారణమని వారు తెలియజేస్తున్నారు. మెంటాడ మండలంలో టీడీపీకి మెజార్టీ ఓట్లు లభిస్తాయని వైసీపీ నేతలు సైతం అంచనా వేస్తుండడం విశేషం. సాలూరు, మక్కువ మండలాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని రాజకీయ పరిశీలకుల అంచనా. పాచిపెంటలో ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు పోలయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో 1,446 వరకు పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. వాటిల్లో అత్యధిక ఓట్లు టీడీపీకి లభించే అవకాశముంది. నోటా భయం సైతం అభ్యర్థులను వెంటాడుతోంది. ఏదేమైనా మండలాల వారీగా అంచనాలు కట్టి.. ‘మేమే గెలుస్తాం’ అని టీడీపీ, వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి.

గత ఎన్నికల్లో..

2009లో టీడీపీ అభ్యర్థిగా గుమ్మిడి సంధ్యారాణి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీడిక రాజన్నదొర పోటీ చేశారు. అప్పట్లో 1,20,950 ఓట్లు పోల్‌ కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి రాజన్నదొరకు 49,517 ఓట్లు, సంధ్యారాణికి 47,861 ఓట్లు లభించాయి. పోస్టల్‌ బ్యాలెట్లు రాజన్నదొరకు 478, సంధ్యారాణికి 225 లభించాయి. ఆ ఎన్నికల్లో రాజన్నదొర 1656 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో 1,34,355 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి రాజన్నదొరకు 63,472 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఆర్పీ భంజ్‌దేవ్‌కు 58,546 ఓట్లు లభించాయి. పోస్టల్‌ బ్యాలెట్లు రాజన్నదొరకు 283, భంజ్‌దేవ్‌కు 212 లభించాయి. 2019లో ఎన్నికల్లో 1,52,004 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాజన్నదొరకు 78,430 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్‌కు 58,401 ఓట్లు లభించాయి. పోస్టల్‌ బ్యాలెట్లు రాజన్నదొరకు 814, భంజ్‌దేవ్‌కు 316 లభించాయి. ఈ ఎన్నికల్లో రాజన్నదొర 20,029 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి , వైసీపీ అభ్యర్థి రాజన్నదొర మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే విజయానికి పోస్టల్‌ బ్యాలెట్‌తో సహా ప్రతి ఓటు కీలకం కానున్నది. సాలూరు గద్డె నెక్కెదెవరో కొద్దిరోజుల్లో స్పష్టం కానుంది.

Updated Date - May 31 , 2024 | 11:23 PM