Share News

‘కోట’లో కొలువుదీరేదెవరో?

ABN , Publish Date - May 29 , 2024 | 11:50 PM

శృంగవరపుకోటలో విజేత ఎవరు? టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో మరోసారి చరిత్ర పునరావృతమవుతుందా? మూడోసారి కోళ్ల లలితకుమారి పగ్గాలు చేపడ్తారా? లేక వరుసగా రెండోసారి వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు విజయాన్ని చేజిక్కించుకుంటారా..? నియోజకరవ్గంలో ఎక్కడ చూసినా ఈ చర్చే సాగుతోంది. కౌంటింగ్‌కు ఇంక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎవరి లెక్క ఏంటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇరుపార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అవిర్భావం తరువాత 2004, 2019లో మాత్రమే ఓటమి చూసింది.

‘కోట’లో కొలువుదీరేదెవరో?

‘కోట’లో కొలువుదీరేదెవరో?

బదులు తీర్చుకుంటానంటున్న టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి

మళ్లీ తనకే అవకాశమంటున్న వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు

మండలాల వారీగా ఓట్లపై లెక్కలు కట్టుకుంటున్న పార్టీలు

టీడీపీ అవిర్భావం తరువాత 2004, 2019లో మాత్రమే ఓటమి

శృంగవరపుకోటలో విజేత ఎవరు? టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో మరోసారి చరిత్ర పునరావృతమవుతుందా? మూడోసారి కోళ్ల లలితకుమారి పగ్గాలు చేపడ్తారా? లేక వరుసగా రెండోసారి వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు విజయాన్ని చేజిక్కించుకుంటారా..? నియోజకరవ్గంలో ఎక్కడ చూసినా ఈ చర్చే సాగుతోంది. కౌంటింగ్‌కు ఇంక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎవరి లెక్క ఏంటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇరుపార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అవిర్భావం తరువాత 2004, 2019లో మాత్రమే ఓటమి చూసింది.

శృంగవరపుకోట, మే 29:

ఎస్‌.కోటలో ఎవరికి వారే విజేత అంటున్నారు. తమకున్న అనుకూలతలను చెప్పుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే లోలోపల మాత్రం వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. మండలాల వారీగా ఎవరికి ఎన్నోట్లు పడ్డాయో ఆరా తీస్తున్నారు. ఇక్కడ ద్వీముుఖ పోటీ నెలకొంది. శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలసతో పాటు జామి మండలంలో సగం గ్రామాలతో ఈ నియోజకవర్గం విస్తరించింది ఉంది. కేవలం వేపాడ మండలంలో వచ్చే అధిక్యంపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అన్ని మండలాల్లోను అధిక్యం సాధిస్తామన్న ధీమాతో టీడీపీ ఉంది. వీరి అంచనాలనటుంచితే తటస్థుల మధ్య జరుగుతున్న చర్చల్లో టీడీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. తెలుగు దేశం అభ్యర్థి కోళ్ల లలిత కుమారి 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరసగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి రెండు సార్లు శాసన సభలో అడుగెట్టారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు పాగా వేసారు. మళ్లీ ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో బదులు తీర్చుకుంటా నని కోళ్ల లలిత కుమారి అంటుండగా , మళ్లీ నాకే అవకాశమిస్తారని కడుబండి శ్రీనివాసరావు చెబుతున్నారు.

కూటమిలో భారీ అంచనాలు

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ అంచనాల్లో ఉంది. కోళ్ల లలిత కుమారికి 2014లో వచ్చిన 28,537 భారీ మేజార్టీ కంటే ఎక్కువగా ఓట్లు పడతాయని చెబుతున్నారు. దీనికి కారణం వైసీపీ గాలిలో 2019లో కడుబండి శ్రీనివాసరావుకు 11,300 మెజార్టీ మాత్రమే వచ్చింది. అప్పట్లో వైసీపీ నాయకులంతా కలిసికట్టుగా ఇతని విజయం కోసం పని చేశారు. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. గాలి వాటంగా జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ మెజార్టీ రాలేదు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి పని చేశాయి. వైసీపీ వర్గాలుగా విడిపోయింది. వైసీపీకి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు సాధించిపెట్టే స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు వర్గీయులు టీడీపీలో చేరిపోయారు. ఇతని భార్య, ఎస్‌.కోట వైఎస్‌ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు టీడీపీ విజయానికి చెమటోడ్చారు. కాగా వైసీపీ మండల, గ్రామ స్థాయి నాయకులు మనస్ఫూర్తిగా పని చేయలేదని ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. సీఎం జగన్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకత వుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతను ప్రజలు గుర్తించారు. రెండు దఫాలు శాసన సభ్యురాలుగా వ్యవహరించిన సమయంలో లలిత కుమారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యధికంగా కుటుంబాలను అదుకున్నారు. ఓటమి చెందినా నియోజకవర్గ ప్రజలకు గత ఐదేళ్లుగా అందుబాటులో ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు ఒన్‌సైడ్‌ పడినట్లు బహిర్గతమైంది. ఇన్ని సానుకూలతల మధ్య లలితకుమారి భారీ మెజారిటీ సాధిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

గెలుపు అంచనాల్లో వైసీపీ

వైసీపీ కూడా గెలుపు అంచనాల్లో ఉంది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీలక్ష్మి విశాఖ పార్లమెంట్‌ సభ్యురాలిగా పోటీ చేయడంతో వీరి సామాజికవర్గం ఓట్లన్నీ పడ్డాయన్న ఆశతో వున్నారు. ఐదేళ్లుగా నవరత్నాల పేరుతో అందిస్తున్న నగదు బదిలీ పథకాలు ఓట్లు రాల్చాయన్న అంచనాలు కడుతున్నారు. మహిళలు, పేదలు, సామాజిక ఫించన్‌దారులు తమ వైపే వున్నారని చెబుతున్నారు. కడుబండి శ్రీనివాసరావు స్థానికేతరుడైనప్పటికీ ఈ ఐదేళ్లు స్థానికంగా వుండడంతో సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారని, వారంతా నమ్మకంగా పనిచేయడంతో గెలుపు తమదే అంటున్నారు.

మండలాల వారీగా బలాబలాలు

వేపాడ మండలం వైసీపీకి కొంత అనుకూలంగా వుంది. ఈ పార్టీ శ్రేణులు కూడా ఈ మండలం మెజార్టీనే నమ్ముకొని గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఈ మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి పట్టుంది. దీనికి తోడు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రస్తుత డీసీసీబి చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు గట్టిగా పనిచేశారంటున్నారు. టీడీపీ విషయానికొస్తే ఈ మండలంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు ప్రత్యేక వర్గం వుంది. టీడీపీ టిక్కెట్‌ కోసం పోటీపడ్డ ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణది ఇదే మండలం కావడంతో వీరంతా పార్టీ కోసం పనిచేయడంతో వైసీపీ అంచనాలకు గండి పడిందంటున్నారు.

- లక్కవరపుకోట, కొత్తవలస మండలాలపై పూర్తిగా కోళ్ల లలిత కుమారి కుటుంబానికి అధిపత్యం ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఈ మండలాల నుంచి మెజార్టీ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఈరెండు మండలాల నుంచి 20వేలకు పైబడి మెజార్టీ వస్తుందని టీడీపీ లెక్కలు కడుతోంది.

- ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు పట్టున్న మండలం శృంగవరపుకోట. ఈ మేజర్‌ పంచాయతీలోనే 16వేల ఓట్లు పోలయ్యాయి. ఇందులో పదివేల ఓట్లు టీడీపీకు పడ్డాయని అంచనా కడుతున్నారు. కిల్తంపాలెం, మూలబొడ్డవర, పెదఖండేపల్లి, ముషిడిపల్లి గ్రామాల్లో రఘురాజు వర్గీయులదే హవా. దీనికి టీడీపీ సాంప్రదాయ ఓటు, లలిత కుమారి అభిమానులు తోడవడంతో ఈ నాలుగు గ్రామాల్లోనే ఐదు వేలకు పైబడి ఓట్లు మెజార్టీ వస్తుందని నాయకులు, కార్యకర్తలు సంబరపడుతున్నారు.

- సగం గ్రామాలున్న జామి మండలంలో కూడా నువ్యా, నేనా అన్నవిధంగా పోటీ ఉన్నా టీడీపీకే రెండు వేల ఓట్ల మెజార్టీ రావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికలను పరిశీలిస్తే..

టీడీపీ ఆవిర్భావం నుంచి గత చరిత్రనొకసారి పరిశీలిస్తే ఈనియోజకవర్గం పార్టీకి కంచుకోట. కేవలం రెండు దఫాలు 2004, 2019లో మాత్రమే పరాజయం పొందింది. 1983 నుంచి వరసగా 1994వరకు ఎల్‌.బి దుక్కు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999లో టీడీపీ శోభా హైమావతిని శాసనసభకు పంపించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో వీచిన గాలికి 2004లో ఇక్కడ కూడా టీడీపీ ఓడిపోయింది. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టినప్పటికీ ఇక్కడి ప్రజలు మాత్రం తిరిగి టీడీపీకే పట్టం కట్టారు. 2014 రాష్ట్రం విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీనే గెలిపించారు. కోళ్ల లలితకుమారికి 28,537 ఓట్ల భారీ మేజార్టీని కట్టబెట్టారు. ఎస్‌.కోట నుంచి టీడీపీ 9 దఫాలు బరిలో దిగితే 7 దఫాలు విజయడంకా మోగించింది. కంచుకోటను ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తిరిగి పునఃనిర్మిస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగానే గొంతెత్తుతున్నాయి.

Updated Date - May 29 , 2024 | 11:50 PM