Share News

Who is Rajam King!

ABN , Publish Date - May 27 , 2024 | 11:39 PM

కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు నాయకులు, ప్రజల్లో కూడా టెన్షన్‌ పెరుగుతోంది. రాజాం నియోజకవర్గంలో ద్విముఖ పోరులో ఎవరు విజేత అవుతారోనని ప్రజల్లో చర్చలు జరుగుతుండగా నేతల్లో ఒకటే టెన్షన్‌ కనిపిస్తోంది. ఏ వర్గం ఎటు మళ్లిందోనని ఎడతెగని అంచనాలు వేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో వైసీపీ, కొన్ని మండలాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంటుందన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. పార్టీల నాయకులు, అభిమానుల మాటలు పక్కన పెడితే తటస్థులు కూడా గెలుపోటములపై ఆసక్తి కనబరుస్తున్నారు.

Who is Rajam King!

రాజాం రాజు ఎవరో!

ఇద్దరు నేతల్లోనూ ధీమా

గెలుపోటములపై చర్చలు

నేతల్లో తీవ్ర ఉత్కంఠ

వివిధ వర్గాల ఓట్లపై లెక్కలేసుకుంటున్న శ్రేణులు

కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు నాయకులు, ప్రజల్లో కూడా టెన్షన్‌ పెరుగుతోంది. రాజాం నియోజకవర్గంలో ద్విముఖ పోరులో ఎవరు విజేత అవుతారోనని ప్రజల్లో చర్చలు జరుగుతుండగా నేతల్లో ఒకటే టెన్షన్‌ కనిపిస్తోంది. ఏ వర్గం ఎటు మళ్లిందోనని ఎడతెగని అంచనాలు వేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో వైసీపీ, కొన్ని మండలాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంటుందన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. పార్టీల నాయకులు, అభిమానుల మాటలు పక్కన పెడితే తటస్థులు కూడా గెలుపోటములపై ఆసక్తి కనబరుస్తున్నారు.

రాజాం రూరల్‌, మే 27:

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ తానే విజయం సాధిస్తానని స్పష్టం చేస్తుండగా వైసీపీ అభ్యర్థి తలే రాజేష్‌ సైతం ధీమాగా ఉన్నారు. రెండు శిబిరాల్లో ఇప్పటికే పలుమార్లు గెలుపోటములపై దీర్ఘంగా చర్చలు సాగాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ మళ్లీ అంచనాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లపై చర్చిస్తున్నారు. గ్రామాల వారీగా విశ్లేషిస్తూ ఏగ్రామం మనకు అనుకూలం, ఏ గ్రామంలో ప్రత్యర్థి ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయో అని సరిచూసుకుంటున్నారు.

టీడీపీలో ధీమా

తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ విజయం దాదాపు ఖరారైందని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 2009లో రాజాం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మురళీని విజయం దిశగా నడిపిస్తుందన్నది వారి వాదన. రెండుసార్లు ఓటమిపాలైనా, రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించడం కూడా మురళీ విజయానికి లాభిస్తుందంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజులో పార్టీశ్రేణుల్లో ఉన్న అంసతృప్తిని పోగొట్టేందుకు చతురత ప్రదర్శించి అందరినీ ఒక్కటి చేశారన్న పేరుంది. ప్రధానంగా రాజాం ఎమ్మెల్యేగా పదేళ్లపాటు అధికారం అనుభవించిన కంబాల జోగులు సొంత అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం నియోజకవర్గ అభివృద్ధిపై చూపకపోవడం కూడా టీడీపీకి అనుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో ఫలితం మురళీకి అనుకూలిస్తుందని చెప్పుకుంటున్నారు.

వైసీపీ శిబిరంలో కూడా..

ఎలాంటి రాజకీయ అనుభవంలేని వైసీపీ అభ్యర్థి తలే రాజేష్‌ సునాయాసంగా విజయం సాధిస్తారని ఆ పార్టీ శిబిరం నుంచి వినిపిస్తున్న మాట. పదేళ్లపాటు రాజాం ప్రాంతంలో వైద్యుడిగా అందించిన సేవలతో పాటు పాలకొండ ఎమ్మెల్యేగా రాజేష్‌ తండ్రి తలే భద్రయ్యకు ఉన్న రాజకీయ సంబంధాలు రాజేష్‌ విజయానికి సోపానాలుగా పనిచేస్తాయంటున్నారు. సంక్షేమ పథకాల కింద సీఎం జగన్‌ అందించిన ఆర్థిక సహాయం కూడా గెలుపును సూచిస్తోందంటున్నారు.

బలాబలాలు ఇలా

ఇద్దరు అభ్యర్థులూ నేను గెలుస్తానంటే.. నేను గెలుస్తానని ప్రకటించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రేగిడి మండలం వైసీపీకి కాస్త అనుకూలంగా ఉండొచ్చునన్న వాదన వినిపిస్తోంది. కిమిడి రామకృష్ణంనాయుడు ఈ ఎన్నికలలో వైసీపీ అనుకూలంగా పనిచేయడమే దీనికి కారణమంటున్నారు. ఇక వంగర విషయానికొస్తే వివిధ కారణాల వల్ల నువ్వా.. నేనా అన్న పోటీ ఉంది. సంతకవిటి మండలంలో టీడీపీకి గతంతో పోలిస్తే బలం బాగా పెరిగిందంటున్నారు. ఈ మండలంలో టీడీపీ సీనియర్‌ నేత కొల్ల అప్పలనాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీడీపీకి అత్యధికంగా ఓట్లు పడ్డాయంటున్నారు. ఇక నియోజకవర్గానికి గుండెకాయ వంటి రాజాం టౌన్‌, రూరల్‌ ప్రాంతాల్లో టీడీపీకి గట్టి బలం, బలగం ఉంది. కొంతమంది వైద్యులు సైతం డా.రాజేష్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో రాజాం టౌన్‌, రూరల్‌ ప్రాంతాల్లో హీనపక్షంగా ఎనిమిది నుంచి తొమ్మిదివేల ఓట్లు టీడీపీ ఖాతాలో చేరి ఉంటాయంటున్నారు. దీంతో కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ విజయం సునాయాసమన్న అంచనాకు ప్రజలు సైతం వచ్చారు.

--------------------

Updated Date - May 27 , 2024 | 11:39 PM