విద్యుత్ స్తంభాన్ని ఎత్తుతుండగా..
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:27 PM
కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

-తీగలను తాకిన నిచ్చెన
- షాక్‌కు గురై ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
- మృతుడిది శ్రీకాకుళం జిల్లా
రేగిడి, జూన్ 7: కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం రేగిడి మండల కాంప్లక్స్ సమీపంలో చోటు చేసుకుంది. విద్యుత్ సిబ్బంది, స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పంతులపేట గ్రామానికి చెందిన బొండాది శ్రీనివాసరావు (50), లబ్బ కృష్ణతో పాటు మరో 8 మంది ఉంగరాడమెట్ట సబ్‌స్టేషన్‌కు సంబంధించి విద్యుత్‌లైన్ పునరుద్ధరణ, కొత్త స్తంభాల ఏర్పాటు పనుల కోసం వచ్చారు. శుక్రవారం సాయంత్రం మండల కాంప్లెక్స్ సమీపంలో స్తంభాన్ని ఎత్తేసమయంలో భారీగా గాలివీచింది. దీంతో శ్రీనివాసరావు చేతిలో ఉన్న నిచ్చెన సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్‌లైన్‌కు తగిలినట్లు స్థానిక ఇన్‌చార్జి ఏఈ ఎల్.హరిబాబు తెలిపారు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై శ్రీనివాసరావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కృష్ణ కాళ్ల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలో ఉన్న రేగిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా, అప్పటికే శ్రీనివాసరావు చనిపోయినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. గాయపడిన కృష్ణకు ప్రాథమిక చికిత్స అందించారు. శ్రీనివాసరావుకు భార్య గోవిందమ్మ, పిల్లలు హేమంత్, నవీన్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.