Share News

పెద్దమ్మకు భోజనం ఇచ్చి వస్తుండగా..

ABN , Publish Date - May 31 , 2024 | 11:58 PM

తన పెద్దమ్మకు భోజనం క్యారేజీ ఇచ్చేందుకు ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆమెకు క్యారేజీ అందించి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

 పెద్దమ్మకు భోజనం ఇచ్చి వస్తుండగా..

-డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

- ఇద్దరు యువకుల మృతి

- విజయనగరంలో ఘటన

విజయనగరం క్రైం, మే 31: తన పెద్దమ్మకు భోజనం క్యారేజీ ఇచ్చేందుకు ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆమెకు క్యారేజీ అందించి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లా కేంద్రం విజయనగరంలో శుక్రవారం జరిగింది. విజయనగరం పట్టణంలోని లంకాపట్నంకు చెందిన పొడుగు కిశోర్‌(18), పొడుగు హేమంత్‌(19) స్నేహితులు. కిశోర్‌ పెద్దమ్మ పార్వతి విజయనగరం కోటకు ఎదురుగా ఉన్న బొంకుల దిబ్బవద్ద పండ్లు, కూరగాయలు అమ్ముతుంటుంది. ఆమెకు శుక్రవారం మధ్యాహ్నం భోజనం క్యారేజీ ఇచ్చేందుకు కిశోర్‌ తన ద్విచక్ర వాహనంపై హేమంత్‌తో కలిసి వెళ్లాడు. పార్వతికి క్యారేజీ ఇచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై కంటోన్మెంట్‌ వైపు వస్తుండగా పెద్ద చెరువు ఉత్తర గట్టు రోడ్డుపై ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి సమీపంలో మలుపు తిరుగుతుండగా బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైకు వెనుక కూర్చున్న కిశోర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని వన్‌ టౌన్‌ ఎస్‌ఐ నవీన్‌ పడాల్‌ పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లంకాపట్నంలో విషాదం

కిశోర్‌, హేమంత్‌ మృతితో లంకాపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కిశోర్‌ తండ్రి అర్జునరావు ఇదివరకే మృతి చెందాడు. దీంతో తల్లి వరలక్ష్మి కూలి పనులకు వెళుతూ కుమారుడు కిశోర్‌, కుమార్తెను పోషించుకుం టుంది. కిశోర్‌ డిగ్రీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి వరలక్ష్మి, చెల్లెలు రోదిస్తున్నారు. మరో మృతుడు హేమంత్‌కు తల్లిదండ్రులు సత్యనారాయణ, తల్లి పైడితల్లి అన్నయ్య కృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హేమంత్‌ కూడా కిరాణ షాపులో పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటు న్నాడు. ప్రమాదంలో కుమారుడు మృతి చెందినట్లు తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 11:58 PM