Share News

ఎక్కడ పట్టుబడినా ఇక్కడివే!

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:14 AM

జిల్లా పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. వివిధ సంతల్లో కొనుగోలు చేసి వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు.

ఎక్కడ పట్టుబడినా ఇక్కడివే!

- పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా జిల్లా

- యథేచ్ఛగా కబేళాలకు తరలింపు

- సంతలే ప్రధాన కేంద్రాలుగా వ్యాపారం

-నిద్దరోడుతున్న యంత్రాంగం

- ఈ ఏడాది ఆగస్టు 11న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో కంటైనర్‌ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు తనిఖీ చేయగా 52 పశువులు పట్టుబడ్డాయి. డ్రైవర్‌తో పాటు సిబ్బందిని విచారించగా విజయనగరం జిల్లా పెద్దమానాపురం సంత నుంచి తరలిస్తున్నట్టు చెప్పారు.

- గత నెల 21న పార్వతీపురం మన్యం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద మూడు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో పోలీసులు తనిఖీ చేయగా.. అందులో వందల సంఖ్యలో పశువులు ఉన్నాయి. మానాపురం సంత నుంచి తరలిస్తున్నట్టు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజాం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. వివిధ సంతల్లో కొనుగోలు చేసి వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పశువుల వాహనాలు పట్టుబడినా విజయనగరం సంతల నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు అక్రమ రవాణాదారులు చెబుతున్నారు. జిల్లాలో 16, 26వ నంబరు జాతీయ రహదారులు ఉన్నాయి. వాటిని కేంద్రాలుగా చేసుకొని తరలిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా దత్తిరాజేరు, గుర్ల, నెల్లిమర్ల, రాజాం, రేగిడి ఆమదాలవలస మండలాల నుంచి పశువులు తరలిపోతున్నాయి. కొనుగోలుదారుల విషయం అస్సలు బయటకు తెలియదు. రైతుల రూపంలో గ్రామాల్లోకి వస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంతల్లో రైతుల నుంచి పశువులను కొనుగోలు చేస్తారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చుతారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరైతే కంటైనర్లలో రహస్యంగా తరలించుకుపోతారు. జిల్లాలో వారపు సంతలు అధికం. ప్రధానంగా పెద్దమానాపురం సంత ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద సంత. వారం వారం ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు కోట్లాది రూపాయల్లో ఉంటాయని తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది. శుక్రవారం సాయంత్రానికి పశువులను నడిపించుకొని ఇక్కడకు తెస్తారు. పార్వతీపురం, అలమండ, అచ్చుతాపురం సంతల్లో కొనుగోలు చేసిన పశువులను సైతం ఇక్కడకు తెచ్చి విక్రయిస్తుంటారు. ఒక్కో పశువు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకూ పలుకుతుంది. ఆరోగ్యంగా ఉండే పశువులను తరలించేందుకు ముఠా సిద్ధంగా ఉంటుంది. ప్రతివారం ఇక్కడ నుంచి 8 వేల వరకూ పశువులు తరలిస్తుంటారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువ పశువులు ఇతర రాష్ట్రాలకు కబేళాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా వారపు సంతల్లో సైతం లక్షలాది రూపాయల పశు విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణంగా రైతులు పనుల కాలంలోనే పశువులను ఉంచుకుంటారు. పాలు ఇచ్చిన సమయంలో పాడి పశువులను పెంచుతారు. దీనికితోడు వ్యవసాయంలో యాంత్రీకరణ వచ్చిన తరువాత పశువుల పెంపకం తగ్గింది. క్రమేపీ పశువులను రైతులు విక్రయిస్తున్నారు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల రూపంలో వాటిని కొనుగోలు చేస్తున్నారు. కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కానరాని నిబంధనలు

పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చొనేలా వెసులబాటు ఉండాలి. కానీ, ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. రవాణా విషయంలో కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గ మధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం నిద్ధరోడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముంది.

తనిఖీలు ముమ్మరం చేశాం

జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశాం. పశువులు తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అన్నిరకాల అనుమతులు, వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తున్నారని తేలాక విడిచిపెడుతున్నాం. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలపై సైతం దృష్టిపెట్టాం.

-రాఘవులు డీఎస్పీ, చీపురుపల్లి

Updated Date - Oct 20 , 2024 | 12:14 AM