Share News

ఒంటరి ఏనుగు ఎక్కడ?

ABN , Publish Date - May 26 , 2024 | 11:01 PM

జిల్లాలో గత ఐదు నెలలుగా ఒంటరి ఏనుగు జాడ కనిపించడం లేదు. ‘మన్యం’లో దాని ఆచూకీ లభ్యం కావడం లేదు. ఒడిశా రాష్ట్రం వైపు అది వెళ్లిందనే సమాచారంతో జిల్లా అటవీశాఖ అధికారులు కోరాపుట్‌ అధికారులను సంప్రదించారు.

 ఒంటరి ఏనుగు ఎక్కడ?
మన్యంలో కనిపించని ఒంటరి ఏనుగు

దాని సంచారంపై అటవీశాఖాధికారుల ఆరా

సీతంపేట: జిల్లాలో గత ఐదు నెలలుగా ఒంటరి ఏనుగు జాడ కనిపించడం లేదు. ‘మన్యం’లో దాని ఆచూకీ లభ్యం కావడం లేదు. ఒడిశా రాష్ట్రం వైపు అది వెళ్లిందనే సమాచారంతో జిల్లా అటవీశాఖ అధికారులు కోరాపుట్‌ అధికారులను సంప్రదించారు. అయితే అటు నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఒంటరి ఏనుగు జాడ ప్రశ్నార్థకంగా మారింది.ఏనుగుల సంచారంపై ఇటీవల అటవీశాఖాధికారులు సర్వే చేపట్టారు. దీనిలో భాగంగా 12 బీట్ల పరిధిలో పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీం పరిధిలో ఇద్దరు అటవీశాఖ అధికారులు 15 కిలోమీటర్ల మేర నడుస్తూ ఏనుగుల సంచారం, వాటి మలవిసర్జన గుర్తించారు. ఈ ప్రాంతంలో ఎన్ని ఏనుగులు సంచరిస్తున్నాయని తెలుసుకోవడానికి అటవీశాఖాధికారులు గత మూడు రోజులుగా ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఎక్కడా ఒంటరి ఏనుగు జాడ కానరాలేదు. ఒడిశా లఖేరీ అటవీ ప్రాంతం నుంచి మన్యం జిల్లాకు మొదటి విడతలో 11, రెండో విడత ఏడు ఏనుగులు వచ్చాయి. వాటిల్లో ఆరు ఏనుగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం కొమరాడ అటవీ ప్రాంతంలో ఏడు , భామిని మండలం తాలాడ ప్రాంతంలో నాలుగు గజరాజులు సంచరిస్తున్నాయి. అయితే వాటి వద్దకు ఒంటరి ఏనుగు చేరుకోలేదు. మిగతా ఏనుగులు ఆడవి కాగా, ఈ ఒక్క ఏనుగు మగది. అది ఒంటరిగానే సంచరించేది. ప్రస్తుతం అది కూడా కనిపించకపోవడంతో ఒంటరి ఏనుగు ఏమైందన్న దానిపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పాలకొండ అటవీరేంజ్‌ అధికారి తవిటినాయుడును వివరణ కోరగా.. ఒంటరి ఏనుగు ఆచూకీ కోసం ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా అటవీశాఖాధికారులకు లేఖలు పంపామన్నారు. అయితే వారి నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - May 26 , 2024 | 11:01 PM