Share News

పోస్టల్‌ బ్యాలెట్లు ఎటువైపో

ABN , Publish Date - May 22 , 2024 | 11:56 PM

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పోస్టల్‌ బ్యాలెట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో బయటపడిన వారు ఈసారి అటుఇటు కావొచ్చు. జిల్లాలో ఉద్యోగులు అధిక శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరి భవితవ్యం ఎటు మలుపు తిరుగుతుందో అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. నియోజకవర్గాల వారీగా వారు లెక్కలేసుకుంటున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్లు ఎటువైపో

పోస్టల్‌ బ్యాలెట్లు ఎటువైపో

అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకమయ్యే అవకాశం

జిల్లాలో 19 వేలు పైబడి పోలింగ్‌

గతం కంటే పెరిగిన శాతం

కలెక్టరేట్‌, మే 22: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పోస్టల్‌ బ్యాలెట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో బయటపడిన వారు ఈసారి అటుఇటు కావొచ్చు. జిల్లాలో ఉద్యోగులు అధిక శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరి భవితవ్యం ఎటు మలుపు తిరుగుతుందో అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. నియోజకవర్గాల వారీగా వారు లెక్కలేసుకుంటున్నారు.

గతంలో వలే ఇంటి వద్ద నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే విధానానికి ఈసారి ఎన్నికల సంఘం పుల్‌స్టాప్‌ పెట్టింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో 8,945 మంది ఉద్యోగులే పోస్టల్‌ బ్యాలెట్లు వేశారు. ఈ సారి 19వేలు పైబడి ఓటు వినియోగించుకున్నారు. గతంతో పోల్చితే పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి ఆసెంబ్లీ స్థానంలో 1942 మంది ఉద్యోగులు, చీపురుపల్లిలో 923 మంది, గజపతినగరంలో 1374 మంది, నెల్లిమర్లలో 1098 మంది, విజయనగరంలో 1927, ఎస్‌.కోటలో 1435 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్లు వేశారు. ఈ సారి జరిగిన ఎన్నికలో రాజాం అసెంబ్లీ స్థానంలో సుమారు 2116 మంది, బొబ్బిలికి 2493 మంది, చీపురుపల్లికి 1450మంది, గజపతినగరంకు 2090 మంది, నెల్లిమర్లకు 1760 మంది, విజయనగరంలో 4200 మంది, ఎస్‌.కోటలో 2005 మంది ఉద్యోగులు ఓటు వేశారు. వీరే కాకుండా అత్యవసర విభాగం సేవలు అందించిన ఉద్యోగులతోపాటు సర్వీసు ఓటర్లు కూడా దాదాపు 6 వేలు మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అభిప్రాయం ఉంది. ఈ సారి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. 2019లో తక్కువ ఓట్లతో గెలిచిన అభ్యర్థులకు ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్లు వారికి వ్యతిరేకంగా పడినట్లు తెలుస్తోంది. దీనివల్ల కొద్దిపాటి ఓట్ల తేడాతోనూ కొందరి భవితవ్యం అటుఇటు కావొచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - May 22 , 2024 | 11:56 PM