Share News

కొఠియా ఓటర్లు ఎటువైపు?

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:05 AM

కొఠియా గ్రూప్‌ గ్రామాలు రెండు (ఏపీ, ఒడిశా) రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. ఇక్కడి ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఈ ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది.

   కొఠియా ఓటర్లు ఎటువైపు?
కొఠియా

- ఈ గ్రామాలపై పట్టుబిగిస్తున్న ఒడిశా

- గత ఐదేళ్లలో రూ.కోట్లాది అభివృద్ధి పనులు

- ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రాలకే వచ్చేలా ఏర్పాట్లు

- పట్టించుకోని ఏపీ సర్కారు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 11:

కొఠియా గ్రూప్‌ గ్రామాలు రెండు (ఏపీ, ఒడిశా) రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. ఇక్కడి ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఈ ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. కానీ ఏపీ ప్రభుత్వం చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించలేక పోతోంది. కొఠియా ప్రజలు ఓటు వేసేందుకు వారికి సమీపంలోనే పోలింగ్‌ కేంద్రాలను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 22 కిలోమీటర్ల పరిధిలో నెలకొల్పింది.

ఏవోబీలో ఉన్న కొఠియా గ్రూప్‌ గ్రామాలపై ఒడిశా పట్టుబిగిస్తోంది. మొత్తం 21 కొఠియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇప్పటికే అక్కడి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొఠియా గ్రూప్‌ గ్రామాల్లోని ఓటర్లలో అత్యధికమంది తమ రాష్ట్ర పోలింగ్‌ బూత్‌లకే వచ్చి ఓటు వేసేలా ఒడిశా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కొఠియాలో ఏక కాలంలో ఏపీ, ఒడిశాలకు చెందిన అరకు, కోరాపుట్‌ (లోక్‌సభ స్థానాలు ), సాలూరు, పొట్టంగి అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ఇరు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తారు. ఓటర్లు తమకు నచ్చిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. ఈ విధానం ఎన్నోఏళ్ల నుంచి ఉంది. అయితే, ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ విద్యుత్‌ సిబ్బంది గత నెల 28న దిగువ గంజాయిభద్రలో ఉచిత విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు వెళ్లితే వారిని ఒడిశా అధికారులు ఎన్నికల కోడ్‌ పేరిట అడ్డుకున్నారు. ఆటోతో సహా సామగ్రి, సిబ్బందిని కొఠియా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి తదుపరి విడిచిపెట్టారు.

ఒడిశా అధికారుల ముమ్మర పర్యటనలు

ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ జెనా, వ్యవసాయశాఖ రాష్ట్ర కార్యదర్శి అరవింద్‌కుమార్‌ పాఢి, కోరాపుట్‌ ఎన్నికల అధికారి (జిల్లా కలెక్టర్‌) కీర్తివాసన్‌, దక్షిణాంచల్‌ రేంజ్‌ డీఐజీ చరణ్‌సింగ్‌ మిశ్రా, కోరాపుట్‌ ఎస్పీ అభినవ్‌ సోంకర్‌ తదితరులు కొఠియాలో ఈ నెల 5న పర్యటించారు. గంజాయిభద్ర ఆదర్శ విద్యాలయం, కొఠియా 5 టీ పాఠశాలలను పరిశీలించారు. స్ట్రాబెర్రి సాగు, కొఠియా పంచాయతీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఆసుపత్రి, అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం పరిశీలించి వెళ్లారు. గత నెల 22న ఒడిశా ఎన్నికల సీఈవో నికుంజ బిహారి దైల్‌ కూడా పర్యటించారు. కొఠియా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే వారు పర్యటించినట్లు పలువురు భావిస్తున్నారు. గత ఐదేళ్లలో కొఠియాలో రెండు సార్లు ఒడిశా సీఎస్‌, వ్యవసాయ రాష్ట్ర కమిషనర్‌, ఆర్డీసీ (రీజియన్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ) పర్యటించగా, కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అయితే తరచూ పర్యటిస్తున్నారు.

దృష్టి సారించని ఏపీ అధికారులు

వివాదస్పద కొఠియా గ్రామాల్లో పర్యటనలపై ఏపీ ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు. సామరస్య పూర్వక ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఇటీవల విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఇదే విషయమై ఒడిశాకు చెందిన కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ వి.కీర్తివాసన్‌, ఎస్పీ అభినవ్‌ సోంకర్‌తో చర్చించారు.

ఆరుచోట్ల ఒడిశా.. నాలుగు చోట్ల ఏపీ పోలింగ్‌ కేంద్రాలు

కొఠియా గ్రామాల గిరిజనులు ఓటు వేసేందుకు అనువుగా పగులుచెన్నారు, కొఠియా, ఎగువ గంజాయిభద్ర, రణసింగి, గాలిగాబడరుల్లో పోలింగ్‌ కేంద్రాలను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొఠియాలో 510 మంది ఓటర్లు, పగులుచెన్నారులో 598 మంది, మూడకారులో 338, గంజాయిభద్రలో 769, రణసింగిలో 584, గాలిగబాడరులో 535 మంది ఓటర్లు ఉన్నారు. కనీసం 2 నుంచి 6 ఆరు కిలోమీటర్ల దూరం లోపు పోలింగ్‌ బూత్‌లను ఒడిశా ఏర్పాటు చేసింది. ఏపీ మాత్రం కొఠియా గ్రూప్‌ గ్రామాల నుంచి నమోదైన 2,554 మంది ఓటర్ల కోసం నేరేళ్లవలసలో రెండు, శిఖరపరువు, కురుకూటిలో ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్‌ బూత్‌లకు రావాలంటే కనీసం 4 నుంచి అత్యధికంగా 22 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

బిల్లులు చెల్లించని ఏపీ సర్కారు

గత ఐదేళ్లలో దాదాపు రూ.210 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్టు ఒడిశా రాష్ట్ర రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ గ్రామాల్లో బీటీ రోడ్లు, వంతెనలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసింది. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కొఠియా గ్రూప్‌ గ్రామాలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. చేసిన పనులకు బిల్లులు కూడా సక్రమంగా చెల్లించలేకపోతుంది. ఫలితంగా నేరేళ్లవలసలో సంత షెడ్డు, తదితర పనులు నిలిచిపోయాయి. అదే విధంగా పగులుచెన్నారు, పట్టుచెన్నారు తదితర గ్రామాల్లో ఏపీ పక్షాన చేసిన వీధిరోడ్లు, కాలువలు, ఫ్లడ్‌వాల్‌ తదితర పనులకు బిల్లులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:05 AM