Share News

కొఠియా ఓటర్ల పరిస్థితి ఏంటో!

ABN , Publish Date - May 12 , 2024 | 11:59 PM

కొఠియా గ్రూప్‌ ఓటర్లు సాధారణంగా ఇరు రాష్ట్రాలలో ఓట్లు వేస్తారు. గతంలో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే విధంగా ఇరు రాష్ట్రాలలో ఓట్లు వేసేవారు.

కొఠియా ఓటర్ల పరిస్థితి ఏంటో!
నడిచివస్తున్న కొఠియావాసులు (ఫైల్‌)

- అటో ఇటో ఒకవైపే వేయాలంటున్న అధికారులు

సాలూరు రూరల్‌, మే 12: కొఠియా గ్రూప్‌ ఓటర్లు సాధారణంగా ఇరు రాష్ట్రాలలో ఓట్లు వేస్తారు. గతంలో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే విధంగా ఇరు రాష్ట్రాలలో ఓట్లు వేసేవారు. ఒడిశాలో కొరాపుట్‌ లోక్‌సభ, పొట్టంగి అసెంబ్లీ, ఏపీలో అరకు లోక్‌సభ, సాలూరు అసెంబ్లీకి ఈ నెల 13న ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఏక కాలంలో ఒక వ్యక్తి ఇరు చోట్ల ఓట్లు వేయకూడదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు తర్జన భర్జనపడ్డారు. రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు కావడంతో ఏ రాష్ట్రానికి అధికంగా వారి మద్దతు ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. తమ రాష్ట్రానికి అధికంగా ఓటింగ్‌ జరిగే విధంగా ఒడిశా సకల ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కొఠియా వాసుల కోసం నేరేళ్లవలస, శిఖపరువు, కురుకూటిల్లో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఏపీ పోలింగ్‌ కేంద్రాలకు కొఠియావాసులు రావాలంటే గరిష్టంగా 22 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఏపీ ఓటర్ల జాబితా ప్రకారం 2,554 మంది ఓటర్లు ఉన్నారు. ఒడిశా మాత్రం వారి గ్రామాలకు సమీపంగానే కొఠియా, పగులుచెన్నారు, ముడకారు, గంజాయిభద్ర, రణసింగి, గాలిగబడారు, తావుపొదర్‌, గెమ్మెల పొదర్‌, తురియాలో పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసింది. ఒడిశా జాబితా ప్రకారం 5,502 మంది ఓటర్లు ఉన్నారు. కొఠియావాసులు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. వారు తమకు ఇష్టమైన చోట ఒక ఓటును వేసుకోవచ్చునని సాలూరు ఆర్వో విష్ణుచరణ్‌ అభిప్రాయపడ్డారు. మరి వారు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Updated Date - May 12 , 2024 | 11:59 PM