ఏమిటీ మతలబు?
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:32 PM
గ్రామ, వార్డు సచివాలయాల్లో (గ్రేడ్-3) ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారిలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- సచివాలయ ఏఎన్‌ఎంల పదోన్నతులకు ఉత్తర్వులు జారీచేసిన వైద్య ఆరోగ్య శాఖ
- ఈనెల 10న తుదిజాబితా అందించాలని ఆదేశాలు
- అర్హత, ఖాళీలను బయటపెట్టని వైనం
- కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఉత్తర్వులు ఇవ్వడంపై సందేహాలు
శృంగవరపుకోట, జూన్ 7: గ్రామ, వార్డు సచివాలయాల్లో (గ్రేడ్-3) ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారిలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీనియార్టీ జాబితాలో ఉన్న అభ్యంతరాలను సరిచేసి తుది జాబితాను ఈనెల 10న వెల్లడించాలని గడువు విధించింది. 11న కౌన్సిలింగ్, 12న పదోన్నతి ఆర్డర్, 13న జిల్లా వెబ్‌సెట్, కమిషనర్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సెట్‌లో పదోన్నతి పొందినవారి వివరాలను డిస్‌ప్లే చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 500మందికి పైబడి గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు ఉన్నారు. వీరి పదోన్నతి కోసం జీవో జారీ చేసిన అధికారులు సీనియార్టీ జాబితాను తయారు చేసేందుకు అమలు చేస్తున్న నిబంధనలను మాత్రం బయటపెట్టడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ పరిక్షల్లో వచ్చిన మార్కులను బట్టి సీనియార్టీ జాబితా ఉంటుందని మాత్రమే చెబుతున్నారు. పదోన్నతుల ఖాళీలు ఎన్ని ఉన్నాయో కూడా బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
ఉత్తర్వులు అమలయ్యేనా?
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలు, సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్‌ఎంల విధుల నిర్వహణ ఒకేలా ఉంటుంది. గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు పంచాయతీ రాజ్‌శాఖ కూడా అదనంగా పని చెబుతుంది. వీరి జీతభత్యాలను పెట్టే డీడీవో అధికారం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో పంచాయతీలోని ఇతర పనులను అప్పగిస్తున్నారు. ఇంతగా పని ఒత్తిడి ఉన్నా గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు, వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంలకు మధ్య రూ.10వేలకు పైబడి జీతభత్యాల్లో తేడా ఉంది. గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు తక్కువ వేతనం ఇస్తుండడంతో కనీసం పదోన్నతి వచ్చిన జీతం పెరుగుతుందన్న ఆశతో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష రాసిన వీరంతా ఒకే రోజున జాయిన్ అయ్యారు. వీరిలో చాలా మంది కాంట్రాక్టు-2 ఏఎన్‌ఎంలుగా 12 ఏళ్ల పాటు పని చేసిన వారే. ఈ పని కాలాన్ని సర్వీస్‌లో చూపాలని వైసీపీ ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోలేదు. పదోన్నతుల ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఏ ప్రాతిపాదికన పదోన్నతి కల్పిస్తారు? తమకు అవకాశం వ స్తుందా? రాదా అన్న మీ మాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, ప్రభుత్వం మారుతున్న తరుణంలో ఈ ఉత్తర్వులు అమవుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
111111111111111111