Share News

ఇవ్వనివి.. ఇచ్చినట్లు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:03 AM

సీఎం జగన్‌ సంతకంతో కూడిన పత్రాలను వలంటీర్లతో ఇంటింటికీ అందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి తెరతీసింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ‘ మీ కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం.. ’ అని ప్రచార ప్రతాల్లో చూపిస్తూ.. ఐదేళ్ల పాలనలో ఏయే పథకం కింద ఎంత లబ్ధి పొందారో స్వయంగా కొన్ని పథకాలు వివరిస్తూ పత్రాలు పంపిణీ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది.

ఇవ్వనివి.. ఇచ్చినట్లు!
గరుగుబిల్లి మండలం గొట్టివలసలో ఓ వ్యక్తికి రైతు భరోసా అందించినట్లు ఇచ్చినపత్రం

లబ్ధిదారులకు పత్రాలు అందజేత

ఇంటింటికీ పంపిణీ చేస్తున్న వలంటీర్లు

ఎన్నికల వేళ సరికొత్త ప్రచారానికి తెరతీసిన వైసీపీ సర్కారు

కొందరికి పథకాలు అందకపోయినా..

మంజూరు చేసినట్లుగా చూపుతున్న వైనం

మండిపడుతున్న ప్రజలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

‘ఐదేళ్ల పాలనలో దేవుని దయతో ప్రభుత్వం మీ కుటుంబానికి ఈ పథకాలు అందించింది. ప్రతి గ్రామానికి.. ప్రతి కుటుంబానికి అండగా నిలబడగలిగాం..మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డను ఆశ్వీరదించండి..’

- మీ ముఖ్యమంత్రి జగన్‌

======================================

.. ఇలా సీఎం జగన్‌ సంతకంతో కూడిన పత్రాలను వలంటీర్లతో ఇంటింటికీ అందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి తెరతీసింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ‘ మీ కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం.. ’ అని ప్రచార ప్రతాల్లో చూపిస్తూ.. ఐదేళ్ల పాలనలో ఏయే పథకం కింద ఎంత లబ్ధి పొందారో స్వయంగా కొన్ని పథకాలు వివరిస్తూ పత్రాలు పంపిణీ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆ పత్రాలతో లబ్ధిదారుల ఫొటోలను సైతం వలంటీర్లు తీసుకోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఏదేమైనా ఎన్నికల వేళ ‘గడప గడపకూ సంక్షేమం’ పేరిట వలంటీర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు పత్రాలు అంస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా కొంత మందికి పథకాలు అందకపోయినా.. పత్రాల్లో అందించినట్లుగా చూపించడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ఇదేం తీరు అని సర్కారును ప్రశ్నిస్తున్నారు. అర్హులందరికీ పథకాలను అందించామని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు.. కొందరికి పథకాలు అందించకుండానే అందించామని పత్రాలు ఇచ్చి ప్రచారం నిర్వహించడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇటువంటి చర్యలేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో చూపించినట్లుగా తమకు ఏ సంక్షేమ పథకాలు అందేలేదని పలువురు వాపోతున్నారు.

కొన్నిచోట్ల ఇలా..

జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల వలంటీర్లు అందించిన పత్రాలను పరిశీలించగా. సీతంపేటలోని ఓ మహిళకు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సీఎం జగన్‌ సంతకంతో ఒక పత్రం అందింది. దీంతో ఒక్కసారిగా ఆ గృహిణితో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తమకు ఎటు వంటి స్థలం అందించకుండానే మంజూరు చేసినట్లు పత్రం ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో ఒక పాస్టర్‌కు రూ.5 వేలు ఆర్థిక సాయం, జగనన్న తోడు ద్వారా అందించిన రుణం తప్ప మిగిలిన సంక్షేమ పథకాలేవీ అందలేదు. కానీ ఆ పాస్టర్‌కు జగనన్న వసతి దీవెన, తదితర సంక్షేమ పథకాలు కూడా అందించినట్టు ఆ పత్రంలో పొందుపరిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాల గురించి సర్కారు చెప్పుకోవడంలో తప్పు లేదు గానీ మంజూరు చేయని వారికి సైతం అన్నీ అందించినట్లు పత్రాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం పథకాలు మంజూరు చేస్తే.. తమకు అందించకుండా అధికారులు ఏమైనా తప్పు చేశారా?.. లేకుంటే ఎన్నికల వేళ సర్కారే అబద్ధపు ప్రచారం చేస్తుందా? అని వారు సందేహిస్తున్నారు.

ఆసక్తి చూపని జనం..

గరుగుబిల్లి : మండలంలోని 13 గ్రామ సచివాలయాల పరిధిలో గత రెండు రోజులుగా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో బయోమెట్రిక్‌ వేయించి లబ్ధి పొందిన వివరాలతో కూడిన కరపత్రాలను అందిస్తున్నారు. గడప గడపకు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లుగా పత్రాలు పంపిణీ చేస్తున్నారు. అయితే పథకాల నుంచి లబ్ధి పొందకపోయినా మంజూరు చేసినట్లు పత్రాల్లో చూపిస్తుండడంతో మండలవాసులు విస్తుపోతున్నారు. గొట్టివలసకు చెందిన ఓ వ్యక్తికి ఎటువంటి భూములు లేవు. అయితే ఆయన రైతుభరోసాలో రూ.47,500 లబ్ధి పొందినట్లు కరపత్రాన్ని వలంటీర్లు అందించారు. కొవిడ్‌ సమయంలో అందకపోయినా రూ.వెయ్యి ఇచ్చినట్లు పొందుపర్చారు. కాగా ఇచ్చిన హామీలు 129 అయితే అమలు చేసినవి 128 అన్న అంకెలను చూసి పలువురు నవ్వుకుంటున్నారు. ఐదేళ్లుగా 99 శాతం హామీలు అమలు చేశామని కరపత్రాల రూపంలో పంపిణీ చేస్తున్నా.. గ్రామాల్లో ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. బయోమెట్రిక్‌ వే యాలని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది బతిమలాడుతున్నా పలువురు ససేమిరా అంటున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంటింటా తిరుగుతూ మభ్యపెడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం కరపత్రాల్లో అధికంగా లేనివి ఇచ్చినట్లుగా చూపిస్తుండడంతో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:03 AM