Share News

ఏం జరుగుతోందక్కడ?

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:27 PM

అది పెదఖండేపల్లి, కృష్ణాపురం పంచాయతీలను ఆనుకుని ఉన్న ఖండేపల్లి మెట్ట. ఆయా గ్రామాలకు శివారున ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అయితే గతంలో ఇక్కడ సుమారు 100 ఎకరాలు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఈ మెట్ట భాగం తనదే అంటున్నాడు.

ఏం జరుగుతోందక్కడ?
కృష్ణాపురం-కండేపల్లి మెట్ట వద్ద భారీగా తవ్వకాలు

ఏం జరుగుతోందక్కడ?

కృష్ణాపురం - ఖండేపల్లి మెట్ట వద్ద భారీగా తవ్వకాలు

ఈ భూమంతా తనదే అంటున్న ఓ వ్యక్తి

లేదు చాలా వరకు మెట్ట అంటున్న గ్రామస్థులు

సర్వే చేయడానికి తీరిక లేని రెవెన్యూ

రెండు నెలలుగా అక్కడ తవ్వకాలు

శృంగవరపుకోట రూరల్‌, జూన్‌ 3 : అది పెదఖండేపల్లి, కృష్ణాపురం పంచాయతీలను ఆనుకుని ఉన్న ఖండేపల్లి మెట్ట. ఆయా గ్రామాలకు శివారున ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అయితే గతంలో ఇక్కడ సుమారు 100 ఎకరాలు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఈ మెట్ట భాగం తనదే అంటున్నాడు. ఈ కొండలో మరో ఏడు ఎకరాల స్థలం తనదని చెబుతు రెండునెలలుగా పెద్దఎత్తున తవ్వకాలు చేస్తున్నాడు. ఆ మట్టిని తన పొలాలకు తరలిస్తున్నాడని సమాచారం. తవ్వకాల వ్యవహారం గ్రామ పెద్దల దగ్గర ప్రస్తావించగా ఈ మెట్ట పెదఖండేపల్లి పంచాయతీ రెవెన్యూలో 108, కృష్ణాపురం రెవెన్యూలో 30 సర్వేనెంబర్లలో విస్తరించి ఉందని, సుమారు 110 ఎకరాలు ఉంటుందంటున్నారు. కొద్దిమందికి ఇక్కడి వ్యవహారం తెలిసినప్పటికీ ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. విలేకరులు ప్రస్తావించగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్దినెలల కిందట ఇక్కడున్న మెట్టలో కొంతభాగం (రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమి) మండ లంలోని గిరిశిఖర ప్రాంతం దారపర్తికి రోడ్డువేసేందుకు ప్రభుత్వం సేకరించగా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మెట్టపైనే కొంత భూమిని అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలిస్తే ప్రకృతి విధ్వంసాన్ని తలపిస్తున్నాయి. మెట్ట కాస్త సాధారణ భూమిగా మార్చేస్తున్నారు. తవ్వకాలు చేపట్టిన వ్యక్తి మాత్రం చాలా ధీమాగా తన భూమి మెట్టలో కలిసి ఉందని, అందుకే తవ్వుకుంటున్నానని చెబుతున్నాడు. ఇదే విషయాన్ని పంచాయతీ సర్పంచ్‌ యామినిదేవి వద్ద ప్రస్తావించగా మెట్ట ప్రాంతం అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వ భూమి ఆక్రమించారని మండల సమవేశాల్లో చెప్పినా తన మాట ఎవ్వరూ వినలేదన్నారు. వీఆర్‌వో, సచివాలయ సర్వేయర్‌లకు పలుమార్లు చెప్పామన్నారు. ఇదేవిషయమై మండల సర్వేయర్‌ వెంకటరావును వివరణ కోరగా అక్క డున్న భూమిలో సర్వేచేయాల్సి ఉందన్నారు. గతంలో ఈమెట్ట వద్ద సర్వేచేసి రాళ్లు వేసేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పాడన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక సర్వే చేస్తామన్నారు. ఇదే విషయంపై తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా అక్కడ అటవీశాఖకు స్ధలం ఇచ్చారని, అది అయితే తమ పరిధిలోకి రాదని తేల్చేశారు. అటవీశాఖ డీఆర్‌వో రవికుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వం తమకు అప్పగించిన భూభాగంలో తవ్వకాలు లేవని, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం అటవీశాఖకు చెందదని చెప్పడం విశేషం. గ్రామస్థులకు మాత్రం మెట్ట వద్ద జరుగుతున్న తవ్వకాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. కలెక్టర్‌, ఆర్డీవో స్థాయిలో విచారణ జరిగితేనే నిజం నిగ్గుతేలుతుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:27 PM