Share News

కోడ్‌ ఉంటే మాకేం?

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:46 PM

ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా. అయితే ఎన్నికల వేళ సీన్‌ మారింది. ఎన్నడూ లేని విధంగా జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సజావుగా ఎన్నికలు జరిగేనా? అన్న సందేహాలు వ్యక్తమవు తున్నాయి.

కోడ్‌ ఉంటే మాకేం?

పార్వతీపురం నియోజకవర్గంలో ఉల్లంఘనలు

అయినా చర్యలు అంతంతమాత్రమే..

ఈ పరిణామాలతో ప్రజల్లో ఆందోళన

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా. అయితే ఎన్నికల వేళ సీన్‌ మారింది. ఎన్నడూ లేని విధంగా జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సజావుగా ఎన్నికలు జరిగేనా? అన్న సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ప్రధానంగా పార్వతీపురంలో నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు కోడ్‌ను పట్టించుకోవడం లేదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రశ్నించిన వారిపై దాడులు, దూషణలకు దిగుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. దీంతో జిల్లాకేంద్రంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరి మీద ఎవరు ఫిర్యాదులు చేసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు వ్యవహ రిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ జిల్లా కేంద్రంలోని ఇలా ఉంటే.. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొద్దిరోజులుగా పార్వతీపురంలో అధికార పార్టీ నేతలు ఏ విధంగా వ్యవహరించారో ఇప్పుడు తెలుసుకుందాం.

- దివ్యాంగులు, 85 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిని కూడా వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రధానంగా పార్వతీపురం నియోజకవర్గంలో అనేక పంచాయతీల్లో వలంటీర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా దివ్యాంగులు, వృద్ధుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12డీ దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లగా.. పలువురు వలంటీర్లను విధుల నుంచి తొలగించిన విషయం విధితమే.

- వైసీపీ అభ్యర్థి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేరుతో ఓ వాయిస్‌ మెసేజ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘ఎన్నికల్లో వలంటీర్లు వైసీపీకి సహకరించాలి. సీఎం జగన్‌ అందించినసంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులంతా వైసీపీకి ఓటు వేసే విధంగా చూడాలి’ అని జోగారావు వాయిస్‌తో ఓ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఇది కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించినట్లు కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

- ఈ నెల 14న ఎమ్మెల్యే జోగారావు తన ఇంటిలో వలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ..సకాలంలో స్పందించని పరిస్థితి. దీంతో టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చివరకు పోలీసులు చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. లేదంటే హింసాత్మకమైన ఘటనలు జరిగేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

- ఈ నెల 14న పార్వతీపురంలో రాయగడ రోడ్డు వద్ద ఎన్నికల ప్రచారానికి వైసీసీ నేతలు అనుమతులు పొందారు. కానీ అనుమతులు పొందిన చోట సమావేశం నిర్వహించలేదు. ఎమ్మెల్యే జోగారావు, ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో రోడ్లును బ్లాక్‌ చేసి సిద్ధం సభను నిర్వహించారు.ఇది నూటికి నూరు శాతం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లే. సుమారు మూడు గంటల పాటు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ కూడా స్తంభించింది. అయితే దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానికంగా అధికార యంత్రాంగం ఉన్నా..

కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో తదితర అధికారులంతా పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఉన్నారు. అయినప్పటికీ పార్వతీపురంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను వారు ఉల్లంఘిస్తున్నారు. అయినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేనెలలో స్వేచ్ఛగా ఓటు వేసుకోగలమో?లేదోనని నియోజకవర్గవాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా, ప్రశాంత వాతవావరణంలో పోలింగ్‌ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:46 PM