Share News

ఆ హామీ ఏమైంది?

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:32 AM

‘సీతానగరం సమీపంలోని సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం చేపడతాం.. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు తీరుస్తాం..’ అని 2018, నవంబరులో ఆ వంతెన మీదుగా పాదయాత్ర చేపట్టిన జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట పూర్తిగా మారిచారు..

   ఆ హామీ ఏమైంది?
వంతెన నిర్మాణం ఇలా..

అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా పూర్తి చేయని వైనం

సకాలంలో బిల్లులు చెల్లించని సర్కారు

అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు

వాహనదారులకు తప్పని అవస్థలు

సీతానగరం, ఏప్రిల్‌ 29: ‘సీతానగరం సమీపంలోని సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం చేపడతాం.. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు తీరుస్తాం..’ అని 2018, నవంబరులో ఆ వంతెన మీదుగా పాదయాత్ర చేపట్టిన జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట పూర్తిగా మారిచారు.. ఐదేళ్లు గడిచినా.. ఆ హామీ నెరవేర్చలేదు. వంతెన నిర్మాణానికి చొరవ చూపలేదు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పలు చెప్పుకునే సీఎం జగన్‌ ప్రకటనలకే పరిమితమవడంపై ఈ ప్రాంతవాసులు, వాహనదారులు మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లా నుంచి బొబ్బిలి-రాయగడ అంతర్రాష్ట్ర రహదారిలో సీతానగరం వద్ద సువర్ణముఖీ నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇది ఎప్పడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో నూతన వంతెన నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. అప్పట్లో సుమారు రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత శిలాఫకలం ఏర్పాటు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. వంతెన నిర్మాణానికి బ్రేక్‌ పడింది. ఈ లోపుగా పాత వంతెన పరిస్థితి మరింత అధ్వానంగా మారడంతో 2020, జూలైలో నూతన వంతెన నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మరోవైపు పాత వంతెనకు కూడా మరమ్మతులు చేపట్టారు. అయితే వైసీపీ సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులు పూర్తిగా నిలిపివేయకూడదని ఉద్దేశంతో వంతెనకు ఇరువైపులా ఎప్రోచ్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. కాగా సుమారు ఏడాది గడుస్తున్నా సర్కారు బిల్లులను చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో వంతెన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 36వ రాష్ర్టీయ రహదారిపై వంతెన నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో.. ఇంకెప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తప్పని అవస్థలు

వంతెన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. దాదాపు పన్నెండు నెలలుగా నిర్మాణం సాగకపోవడంతో శిథిలావస్థలో ఉన్న పాత వంతెనపై నుంచే వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ర్టాలకు చెందిన సుమారు 2,500 వాహనాలు రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. పాత వంతెనలపై 20 టన్నులకు పైబడి బరువున్న వాహనాలు రాకపోకలను నిషేధించినప్పటికీ అది అమలు కావడం లేదు. అరవై టన్నులు పైబడిన బరువు కలిగిన వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సింగిల్‌ వేలో వంతెనపై ఓ వాహనం వస్తే.. ఎదురుగా వచ్చే వాహనం బ్రిడ్జీకి అవతల వైపు కొద్దిసేపు ఆగాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఎదురెదురుగా వచ్చే వాహనాలు వంతెన మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కాగా పాతవ వంతెన శిథిలావస్థకు చేరుకోగా.. దీనిపై వాహన రాకపోకలు అంత సురక్షితం కాదు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆయా ప్రాంతవాసులు, వాహనదారులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

పాత వంతెన సింగిల్‌ వే కావడంతో భారీ వాహనాలు వచ్చే సమయంలో బ్రిడ్జీ అవతల వైపు వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్కోసారి ఎదురెదురుగా వాహనాలు వచ్చి వంతెన మధ్యలో నిలిచిపోవడంతో గంటకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. దీంతో ప్రయాణికులతో నిరీక్షించలేకపోతున్నాం. ఈ మార్గంలో రాకపోకలు సాగించలేకపోతున్నాం. నిత్యం ఇబ్బందులు పడుతున్నాం.

- ఎ.ఈశ్వరరావు, ఆటో డ్రైవర్‌, సీతానగరం మండలం

===========================

పనులకు చర్యలు

సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులకు సంబంధించి సుమారు రూ. 5 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు రూ.3.5 కోట్లు చెల్లించాం. వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

- ఆర్‌అండ్‌బీ అధికారులు

Updated Date - Apr 30 , 2024 | 12:32 AM