Share News

‘బైపాస్‌’ ఏమైంది జగనన్నా?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:18 AM

‘పార్వతీపురం పట్టణానికి బైపాస్‌ రహదారి నిర్మిస్తాం..వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ట్రాఫిక్‌ కష్టాల నుంచి గట్టెక్కిస్తాం.’ ఇదీ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ. అయితే ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికి అది కార్యరూపం దాల్చలేదు. హామీ నెరవేరలేదు.

‘బైపాస్‌’ ఏమైంది జగనన్నా?
పార్వతీపురంలో ట్రాఫిక్‌ పరిస్థితి ఇదీ..

గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

నేటికీ పనులు ప్రారంభించని వైనం

ట్రాఫిక్‌ వలయంలో పార్వతీపురం

ఇబ్బందుల్లో వాహనదారులు, ప్రజలు

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు.. ఎన్నెన్నో వాగ్దానాలు. ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. అధికారం చేపట్టారు. ప్రజలను మాత్రం మర్చిపోయారు. హామీలు, వాగ్దానాలు గాలికొదిలేశారు. ఇవి ఒకటి, రెండు కాదు.. వందల సంఖ్యలో ఉన్నాయి. గద్దెనెక్కి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రోడ్లూ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మాట ఇచ్చి తప్పిన వైనంపై

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు..

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

‘పార్వతీపురం పట్టణానికి బైపాస్‌ రహదారి నిర్మిస్తాం..వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ట్రాఫిక్‌ కష్టాల నుంచి గట్టెక్కిస్తాం.’ ఇదీ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ. అయితే ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికి అది కార్యరూపం దాల్చలేదు. హామీ నెరవేరలేదు. దీంతో పట్టణవాసులు, వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంతో జిల్లాకేంద్రవాసులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నేడు నామినేషన్లకు నోటిఫికేషన్‌ విడుదలవుతుండగా.. వచ్చేనెలలో పోలింగ్‌ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో బైపాస్‌ రహదారి నిర్మాణం ఇంకెప్పుడు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఎంతో హడావుడిగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో డివిజన్‌ కేంద్రంగా ఉన్న పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారినా.. ఇప్పటికీ అవే సమస్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, విద్యుదీకరణ తప్ప చెప్పుకోదగ్గ పనులేవీ చేపట్టలేదు. ఇదిలా ఉండగా బైపాస్‌ రహదారి నిర్మాణం కలగా మారడంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గతంలో సీఎం జనగ్‌ హామీ ఇచ్చినా నేటికీ ఆ పనులు ప్రారంభం కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బైపాస్‌ రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. భూసేకరణ, ఇతరత్రా పనులకు అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఇంతలోనే సాధారణ ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. ఆ పనులకు బ్రేక్‌ పడగా.. బైపాస్‌ రహదారి నిర్మాణంపై హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దానిపై దృష్టి సారించలేదు. దీంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.

పెరిగిన ట్రాఫిక్‌

పార్వతీపురంలో సుమారు 80 వేలకు పైబడి జనాభా ఉన్నారు. జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది పట్టణానికి వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతవాసులు వారికి కావల్సిన నిత్యావసరాలు, ఇతరత్రా సామగ్రి, వస్తువుల కోసం ఇక్కడి మార్కెట్‌కు చేరుకుంటారు. మరోవైపు జిల్లాకేంద్రం ఒడిశాకు ముఖద్వారంగా ఉండడంతో నిత్యం వందలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పార్వతీపురం మీదుగా నిత్యం ఎంతోమంది రాయగడ, విశాఖ, విజయనగరం, బొబ్బిలి, సాలూరుకు ప్రయాణిస్తుంటారు. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు, రాజకీయ ప్రతినిధులు కూడా రాక సాగిస్తుంటారు. జిల్లా కేంద్ర పరిధిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలల బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా తిరుగుతుంటాయి. దీంతో రోజూ పట్టణం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పట్టణంలో బెలగాం నుంచి రాయగడ రోడ్డు శివారు వరకు ప్రధాన రహదారిలో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు జిల్లా కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రాయగడ రోడ్డు వరకు వాహనాలు పార్కింగ్‌ చేసుకొనేందుకు కూడా ప్రత్యేక స్థలం లేదు. ఈ కారణంగా ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్‌ వలయంలో ప్రజలు చిక్కుకుని నరకం చూస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి బైపాస్‌ రహదారి నిర్మాణం ఎంతో అవసరమైనా.. దానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. ఈ ఇబ్బందులను గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వ పెద్దలతో పాటు అప్పటి అధికారులు బైపాస్‌ రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోగా.. ఈ లోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రతిపాదనను ప్రస్తుత పాలకులు పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో సర్కారు, ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలు చేయలేదు

నేను విధుల్లో చేరిన తర్వాత బైపాస్‌ రహదారి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. గతంలో ఏమైనా ప్రతిపాదనలు తయారు చేశారో లేదో నాకు తెలియదు.

- ఎస్‌ఐ వేణుగోపాలరావు, ఆర్‌అండ్‌బీ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారి

Updated Date - Apr 18 , 2024 | 12:18 AM