Share News

వీల్‌ చైర్లు ఏవీ?

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:13 AM

ప్రభుత్వ సర్వజనాసుపత్రి బోధానాసుపత్రి స్థాయికి ఎదిగినా ఇంకా బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రోగులను తరలించే వీల్‌ చైర్లు పూర్తిస్థాయిలో లేవు. 500 పడకల ఆసుపత్రికి సంబంధించి కనీసం సగం వీల్‌ చైర్లు ఉండాలి.

 వీల్‌ చైర్లు ఏవీ?
వీల్‌ చైర్ల కోసం నిరీక్షిస్తున్న రోగులు

- సర్వజనాసుపత్రిలో కొరత

- 500 పడకలకు 20 వీల్‌ చైర్లే..

- దివ్యాంగులు, వృద్ధులకు తప్పని ఇబ్బందులు

(విజయనగరం రింగురోడ్డు)

ప్రభుత్వ సర్వజనాసుపత్రి బోధానాసుపత్రి స్థాయికి ఎదిగినా ఇంకా బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రోగులను తరలించే వీల్‌ చైర్లు పూర్తిస్థాయిలో లేవు. 500 పడకల ఆసుపత్రికి సంబంధించి కనీసం సగం వీల్‌ చైర్లు ఉండాలి. కానీ 20 వీల్‌ చైర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వజనాసుపత్రిలో ప్రతి రోజూ 500 నుంచి వెయ్యి వరకూ ఓపీ ఉంటుంది. నడవలేని రోగులు వైద్యులు, ల్యాబ్‌ల వద్దకు వెళ్లాలన్నా, వారు ఉన్న గదికి వెళ్లాలన్నా వీల్‌ చైర్లు అవసరం. అయితే అవి పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు వీటికోసం రోగుల మధ్య తగదాలు కూడా జరుగుతున్నాయి. వీల్‌చైర్లు దొరక్కపోవడంతో రోగులను వారి బంధువులే మోసుకుని డాక్టర్లు, ల్యాబ్‌ల వద్దకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఫిర్యాదు చేద్దామన్నా హెల్ప్‌డెస్క్‌ కూడా లేదు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బంది పడ్డాను

నేను ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. దీనివల్ల నడవలేకపోతున్నాను. డాక్టరు వద్దకు వెళ్లేందుకు వీల్‌ చైర్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాను. దానికోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు వీల్‌చైర్‌ దొరకడంతో అందులో నన్ను కూర్చోబెట్టి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. తక్షణమే ఆస్పత్రిలో అవసరమైన వీల్‌ చైర్లు ఏర్పాటు చేయాలి.

-పి.సన్యాసినాయుడు, పూసపాటిరేగ( వీజెడ్‌పీ 10)

అందుబాటులోకి తెస్తాం

ఆస్పత్రిలో వీల్‌ చైర్లు తక్కువగా ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించాం. తక్కువ వీల్‌ చైర్లు ఉండడంతో ఎవరికి వారు, ఆయా విభాగాలకు వెళ్లేందుకు వాటిని ఉపయోగించుకుంటున్నారు. దీంతో మిగిలిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత ఎక్కువ వీల్‌ చైర్లు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తాం.

-అనిలా సునందని, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజనాసుపత్రి

Updated Date - Apr 13 , 2024 | 12:13 AM