సైబర్ నేరాలపై చర్యలేవి?
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:24 PM
సైబర్ నేరాలపై చర్యలుండవా... తెలిసో తెలియకో పని ఒత్తిడిలోనో బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఇస్తే ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా.. బ్యాంకుల నుంచి ఎలాంటి భరోసా ఉండదా.. పోలీసులు కేసు నమోదు చేసి ఊరుకుంటారా.. ఉన్నతాధికారులు స్పందించరా.. ఇలా అయితే ఖాతాల్లో ఎవరూ నగదు ఉంచరు కదా... ఇవీ సైబర్ మోసాలపై జిల్లా అంతటా జరుగుతున్న చర్చ..

సైబర్ నేరాలపై
చర్యలేవి?
చేతులెత్తేస్తున్న బ్యాంకుల అధికారులు
కేసు నమోదుకే పోలీసుల పరిమితం
లబోదిబోమంటున్న ఖాతాదారులు
రాజాం రూరల్, జూన్ 12: సైబర్ నేరాలపై చర్యలుండవా... తెలిసో తెలియకో పని ఒత్తిడిలోనో బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఇస్తే ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా.. బ్యాంకుల నుంచి ఎలాంటి భరోసా ఉండదా.. పోలీసులు కేసు నమోదు చేసి ఊరుకుంటారా.. ఉన్నతాధికారులు స్పందించరా.. ఇలా అయితే ఖాతాల్లో ఎవరూ నగదు ఉంచరు కదా... ఇవీ సైబర్ మోసాలపై జిల్లా అంతటా జరుగుతున్న చర్చ..
బ్యాంకు కన్నా ఇల్లే పదిలమా?
తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, గతంలో బ్యాంకులు విధించిన కఠిన నిర్ణయాల నేపధ్యంలో బ్యాంకు కన్నా ఇల్లే పదిలమనిపిస్తోంది. తమ కష్టార్జితంలో మిగులు మొత్తాన్ని బ్యాంకులో దాచుకునే ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఉండడం లేదు. సైబర్ నేరగాళ్ల పన్నాగంతో కొందరు ఖాతాదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవిత చరమాంకంలో పనికొస్తుందని కొందరు, బయట వ్యక్తులకు అప్పుగానో, వడ్డీరూపంలోనో ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడదని బ్యాంకుల్లో దాచుకున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. బ్యాంకులో ఉంచిన నిల్వలపై ఆదాయం పెద్దగా రాకపోయినా భరోసా ఉంటుందని ఆశిస్తే మొదటికే మోసం వస్తోందని ఖాతాదారులు వాపోతున్నారు.
ఏవీ చర్యలు
రాజాంలోని ఇటీవల ఓ దేవాలయ పూజారి పని ఒత్తిడిలో ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో అతని ఖాతా నుంచి రూ.1.21 లక్షలు మాయమయ్యాయి. గతంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రాజాంకు చెందిన డా. చంద్రశేఖర్ నాయుడు, అతని భార్య ఖాతాల నుంచి రూ. 1.24 లక్షలు కట్ అయ్యాయి. ఈ సంఘటన జరిగిన రెండు వారాల విరామంలో పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన విశ్రాంత ఉద్యోగి అప్పలకొండమ్మ ఖాతా నుంచి రూ. రూ. 60 వేలు పోయాయి. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ అకౌంట్ నుంచి రూ.60 వేలు, సంతకవిటి మండలానికి చెందిన మరో మహిళ రాజాం ఏటీఎం వద్ద రూ.39 వేలు పోగొట్టుకున్నారు. వీరంతా సైబర్ నేరగాళ్ల తెలివికి బలైపోయారు. అలాగే రాజాంకు చెంది విశాఖలో ఉంటున్న ఓ మాజీ ఆర్మీ అధికారి డా. సుధామోహన్ ఖాతా నుంచి ఇటీవల రూ.30 వేలు మాయం అయ్యాయి. ఈ సంఘటన జరిగిన రెండ్రోజుల్లోనే అతని ఖాతా నుంచి రెండోసారి రూ.24 వేలు మాయం చేశారు. రాజాంలో ఉంటున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, అతని సోదరి ఖాతాల నుంచి రూ.2.38 లక్షలు మాయం అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఓటీపీ చెప్పకుండానే సైబర్ నేరగాళ్లు నగదును దోచేశారు.
అధికారులు ఏమంటున్నారంటే..
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే బ్యాంకుల పరంగా చేసేదేమీ లేదని బ్యాంకుల మేనేజర్లు చెబుతున్నారు. అపరిచితులు ఫోన్‌చేసి బ్యాంకులకు సంబంధించిన సమాచారం అడిగితే చెప్పవద్దని ఖాతాదారులకు స్పష్టం చేస్తున్నామని, పోలీసులు సైతం సైబర్ నేరాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని బాంకింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా పొలీస్ అధికారులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించడం మినహా తాము చేయగలిగిందేమీ లేదంటున్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి ఆన్‌లైన్‌లో చేసిన మోసాలకు పరిష్కారం తక్కువని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.