వారి పరిస్థితేంటో?
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:57 PM
జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు నియమించారు. ఈ ప్రక్రియను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా రెగ్యులర్ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళ్లనున్నారు. వారు విధులకు హాజరైతే తమ పరిస్థితేమిటని మరోవైపు గెస్ట్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో గెస్ట్ టీచర్లు..
పార్వతీపురం, జూన్7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు నియమించారు. ఈ ప్రక్రియను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా రెగ్యులర్ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళ్లనున్నారు. వారు విధులకు హాజరైతే తమ పరిస్థితేమిటని మరోవైపు గెస్ట్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, అనసభద్ర, కోటికిపెంట ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వాటిల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల స్థానంలో గెస్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. విద్యార్థులకు వివిధ సబ్జెక్టులను బోధిస్తున్నారు. మొత్తం నాలుగు పాఠశాలల్లో 80 మంది గెస్ట్ ఉపాధ్యాయులుగా ఉన్నారు. కాగా ఎన్నికలకు ముందే రెగ్యులర్ ఉపాధ్యాయులు నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా వారు విధులకు హాజరయ్యే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే గెస్ట్ టీచర్ల విషయంపై వైసీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాల్సి ఉంది. కానీ అలా చేయలేదు. దీంతో గెస్ట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ సర్కారు సకాలంలో ప్రతిపాదనలు పంపించి ఉంటే... రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఉండేదని కొంతమంది గెస్ట్ టీచర్లు వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రిన్సిపాళ్లకు స్థాన చలనం తప్పదు...
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు నియామకం కానున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం నాలుగు పాఠశాలల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లకు స్థాన చలనం తప్పదు. వారంతా మాతృ సంస్థకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.