టీడీపీతోనే సంక్షేమం
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:49 PM
పట్టణంలోని వివిధ డివిజన్ల పరిధిలో మంగళవారం అదితి గజపతి రాజు ఆద్వర్యంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 6: పట్టణంలోని వివిధ డివిజన్ల పరిధిలో మంగళవారం అదితి గజపతి రాజు ఆద్వర్యంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 42, 46 వార్డుల పరిధిలోని దండు మారమ్మ కోవెల, కాలీఘాట్ కాలనీ, తారకరామ కాలనీ, యాత వీధి, గొల్లవీధి, అగురు వీధి, మహంతి వీధి, చాకలవీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు.
టీడీపీలో చేరికలు
విజయనగరం రూరల్: టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతి రాజు సమక్షంలో వైసీపీ మద్దతు కుటుంబాలు కొన్ని టీడీపీలో చేరాయి. మంగళవారం 3వ డివిజన్‌కు చెందిన పత్తి సంతోష్, చాటోజు మోహన్, శేఖర్ తదితరులు మత్స్యకార సంఘం నుంచి 1, 4వ వార్డులకు చెందిన ఎ రామకృష్ణ, ఎస్ దుర్గారావు, బి.ఎల్లాజి తదితరులతో సహా ఆయా కుటుంబాలు టీడీపీలో చేరాయి.
ఇళ్ల కూల్చివేత అన్యాయం
విజయనగరం రూరల్: పట్టణంలోని 40వ డివిజన్ పరిధిలోని బొగ్గుల దిబ్బ ఎస్సీ కాలనీలో గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళితుల ఇళ్లను కొంత మంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో తొలగించడం అన్యాయమని ఆరోపిస్తూ 18 కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వారి వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం నాటికి కేసును వాయిదా వేసింది. ఇంతలోనే ఒక రోజు ముందుగా మంగళవారమే గృహాలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నియో జకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు తదితర నాయకులు అక్కడికి చేరుకున్నారు. బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ బుధ వారం కోర్టు వాయిదా ఉన్నందున అప్పటి వరకు ఆగాలని కోరారు. అయినప్పటికీ వినిపించుకోని మున్సిపల్ సిబ్బంది కూల్చివేతను కొనసాగించారు. చట్టానికి కూడా వైసీపీ నాయకులు గౌరవం ఇవ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇళ్లల్లోని సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం వైసీపీ నాయకుల దౌర్జన్యానికి నిదర్శనమన్నారు.