Share News

ఏనుగుల బెడద తప్పిస్తాం

ABN , Publish Date - May 03 , 2024 | 12:05 AM

జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన హెలీకాఫ్టర్‌లో విశాఖ నుంచి నేరుగా పార్వతీపురం వచ్చారు.

  ఏనుగుల బెడద తప్పిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

పార్వతీపురం, మే2 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన హెలీకాఫ్టర్‌లో విశాఖ నుంచి నేరుగా పార్వతీపురం వచ్చారు. అనంతరం పట్టణ సమీపంలోని చిన్నబొండపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. రూ.35 వేల కోట్లతో విశాఖ నుంచి రాయపూర్‌ వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నాం. అరకు పార్లమెంట్‌ పరిధిలో రూ.22 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్నాం. మన్యం జిల్లా పరిధి సాలూరులో బైపాస్‌ రహదారిని నిర్మించాం. రహదారులు బాగుంటే ఏ ప్రాంతమైనా బాగా అభివృద్ధి చెందుతుంది. రైతుల సమస్యలను పరిష్కరించేలా అనేక చర్యలు తీసుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్రంలో పోలవరం పనుల మంజూరుకు కృషి చేశాం. ఈ ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతను గెలిపించండి. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న బోనెల విజయచంద్రను గెలిపించండి’ అని ఆయన కోరారు.

మద్య నిషేధం ఎక్కడ?

అరకు పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. ‘దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది. నాసిరక్తం, కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు. 30 వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుంది’ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మక సింహాచలం కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.

వైసీపీని ఇంటికి పంపిద్దాం

టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. ‘రాష్ర్టాన్ని అన్ని విధాలుగా సర్వ నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు శివన్నారాయణ, పరశు రామరాజు, టీడీపీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీదేవి, గొట్టాపు వెంకటనాయుడు, బోనుదేవి చంద్రమౌళి, డి.సత్యనారాయణ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.

ఎండను సైతం లెక్కచేయక...

ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు భారీగా సమావేశానికి తరలివచ్చారు. సుమారు గంట ఆలస్యంగా కేంద్రమంత్రి హాజరైనప్పటికీ .. ఆయన ప్రసంగం పూర్తయ్యే వరకు ఎవరూ కదలలేదు. అందరూ ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. ‘పార్వతీపురం ప్రజలకు నమస్కారములు’ అని కేంద్ర మంత్రి తెలుగులో మాట్లాడేసరికి.. సభకు హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కేరింతలతో సందడి చేశారు.

Updated Date - May 03 , 2024 | 12:05 AM