Share News

మాకో దారి ఉంది.. దానికో ధర ఉంది

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:50 PM

ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలులోకి తెచ్చినా.. ఏపీ శాండ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా అడ్డదారిలో ఇసుక తరలింపు ఆగడం లేదు. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేయకుండా దొడ్డిదారిన పట్టుకుపో తున్నారు. ఇసుక వ్యాపారులు అధిక డబ్బుల కోసం గుట్టుగా నదుల్లో నుంచి ఇసుకను తోడేసి వేర్వేరు మార్గాల్లో లబ్ధిదారులకు చేర్చుతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఎలా తీసుకువస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాకో దారుంది.. దానికో ధర కూడా ఉందంటూ సమాధానమిస్తున్నారు.

మాకో దారి ఉంది.. దానికో ధర ఉంది
వేగావతి నది నుంచి ట్రాక్టర్‌లో ఇసుక తరలింపు

మాకో దారి ఉంది.. దానికో ధర ఉంది

వేగావతి నదిలో ఇసుక వ్యాపారుల దోపిడీ

గుట్టుగా తవ్వేసి తరలిస్తున్న వైనం

ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలులోకి తెచ్చినా.. ఏపీ శాండ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా అడ్డదారిలో ఇసుక తరలింపు ఆగడం లేదు. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేయకుండా దొడ్డిదారిన పట్టుకుపో తున్నారు. ఇసుక వ్యాపారులు అధిక డబ్బుల కోసం గుట్టుగా నదుల్లో నుంచి ఇసుకను తోడేసి వేర్వేరు మార్గాల్లో లబ్ధిదారులకు చేర్చుతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఎలా తీసుకువస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాకో దారుంది.. దానికో ధర కూడా ఉందంటూ సమాధానమిస్తున్నారు.

బొబ్బిలి, సెప్టెంబరు 21:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇసుక అక్రమార్కులు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పడం లేదు. బొబ్బిలి ప్రాంతంలో పారాది, అలజంగి, కారాడ, పెంట తదితర ప్రాంతాల్లో వేగావతి నదీ పరివాహక ప్రదేశాల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారు. గత నెలలో ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించుకు పోయి, పెద్దఎత్తున వ్యాపారాలు సాగించారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు కొత్త ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగా ఓ పోర్టల్‌ను కూడా తీసుకొచ్చింది. కానీ ఇసుక వ్యాపారులు ఇప్పటికీ అడ్డదారిని వీడడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తే డబ్బులు పెద్దగా రావనుకుంటున్నారేమో కాని అడ్డదారిని వీడడం లేదు. ఎక్కువగా రాత్రి, వేకువజాము వేళల్లో తరలిస్తున్నారని సమాచారం. అప్పుడైతే ఎవరూ అడ్డుకోరని భావిస్తున్నారు. బొబ్బిలి వేగావతి నదీపరివాహక ప్రాంతంలో ఇసుక తరలించుకుపోతున్నవారిపై అధికారులు నిఘా పెట్టారు. స్థానిక పోలీసులతో పాటు స్పెషల్‌ బ్రాంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు గత కొద్ది రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అయినా వ్యాపారులు అడ్డదారిని వీడడం లేదు. ఇటీవల అలజంగిలో మూడు ట్రాక్టర్లను పట్టుకొని ఏకంగా 40 వేల రూపాయల ఫైన్‌ వేశారు. ఆ తర్వాత రోజే పారాది నది నుంచి అక్రమంగా మెట్టవలస క్వారీ వెనుక భాగం నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఇలా ఈ నెలలో పలు దఫాలు అధికారులు ఇసుక వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించారు. అయినా ఆ పనిని వదలడం లేదు. పైగా ట్రాక్టర్లు ఖాళీగా ఉంటున్నాయని, వాటికి ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని డ్రైవర్లు వింతవాదనకు దిగడం గమనార్హం.

సహించేది లేదు

ఎం.శ్రీను, తహసీల్దార్‌, బొబ్బిలి

ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడిచి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని స్టాకు పాయింట్‌ నుంచి ఎప్పటిలాగే ఇసుక పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం సచివాలయాలకు వెళ్లి గాని, సొంత మొబైల్‌ ఫోన్లలో కాని యాప్‌ను డౌన్‌లోడు చేసుకొని గాని ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇసుకను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు సంబంధిత శాఖల అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం.

Updated Date - Sep 21 , 2024 | 11:50 PM