Share News

హాస్టళ్లలోనే ఉంటున్నాం

ABN , Publish Date - May 19 , 2024 | 11:38 PM

తామంతా బాగానే ఉన్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం హాస్టళ్లలోనే ఉంటున్నామని కిర్గిస్థాన్‌ దేశంలో చదువుతున్న జిల్లా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు ఆదివారం సాయంత్రం ఫోన్‌ చేసి చెప్పారు.

 హాస్టళ్లలోనే ఉంటున్నాం

- ఎలాంటి ఇబ్బందులు లేవు

- కుటుంబ సభ్యులకు చెప్పిన కిర్గిస్థాన్‌లోని జిల్లా విద్యార్థులు

- ఆదుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి లేఖరాసిన ఎంపీ

రాజాం రూరల్‌, మే 19: తామంతా బాగానే ఉన్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం హాస్టళ్లలోనే ఉంటున్నామని కిర్గిస్థాన్‌ దేశంలో చదువుతున్న జిల్లా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు ఆదివారం సాయంత్రం ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రాజాం ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి అక్కడి పరిస్థితులను వివరించారు. భారత విద్యార్థులు ఎవరూ భయాందోళనకు గురికావద్దని, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని, విద్యార్థులు బయటకు రావద్దని, సమస్యలు తలెత్తితే వెంటనే ఎంబసీని సంప్రదించాలని భారత రాయభార కార్యాలయం ఓ ఫోన్‌ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. కాగా, విద్యార్థులను ఆదుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు లేఖ రాశారు. కిర్గిస్థాన్‌లోని బిష్‌కేక్‌ పట్టణంలో బితుకుబితుకుమంటూ జీవనం సాగిస్తున్న రాష్ట్రానికి చెందిన సుమారు 2 వేల మంది వైద్య విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు ప్రారంభించాలని, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భారత రాయభార కార్యాలయం ద్వారా సహాయం అందించాలని ఆ లేఖలో కోరారు. అక్కడి అల్లరి మూకల బారిన పడకుండా, భద్రత కల్పించి వారంతా సురక్షితంగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని రామ్మోహన్‌నాయుడు కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థు లు అక్కడి హాస్టళ్లలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. భారత ఎంబసీ ద్వారా వారిని అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని లేఖలో విజ్ణప్తి చేశారు.

Updated Date - May 19 , 2024 | 11:38 PM