Share News

‘నీరు’గారిన పథకం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:45 PM

జలకళ పేరుతో రైతులకు ప్రభుత్వం ఆశ చూపెట్టి మధ్యలో వదిలేసింది. ప్రతి నియోజవర్గానికి ఒక రిగ్గుబోర్‌ యూనిట్‌ కేటాయించి అవసరమైన రైతాంగానికి బోర్లు వేస్తామని చెప్పి పథకాన్ని జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించారు.

‘నీరు’గారిన పథకం

-కలగా మిగిలిన వైఎస్‌ఆర్‌ జలకళ

-1075 మంది దరఖాస్తులు ఆమోదం

-373బోర్లు డ్రిల్లింగ్‌

-పంపు సెట్లు వేసింది 40 మాత్రమే

-అట్టహాసంగా ప్రారంభించి ఆపై వదిలేసిన వైనం

విజయనగరం(ఆంధ్రజ్యోతి), మార్చి 24: జలకళ పేరుతో రైతులకు ప్రభుత్వం ఆశ చూపెట్టి మధ్యలో వదిలేసింది. ప్రతి నియోజవర్గానికి ఒక రిగ్గుబోర్‌ యూనిట్‌ కేటాయించి అవసరమైన రైతాంగానికి బోర్లు వేస్తామని చెప్పి పథకాన్ని జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించారు. రెండేళ్ల క్రితం అన్ని నియోజకవర్గాలకు వాహనాలను కేటాయించారు. వాటిని చూసిన రైతులు వెంటవెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నాళ్లయినా కదలిక లేకపోవడంతో నేడు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గత కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాన్ని ఈ ప్రభుత్వం మూలకు చేర్చింది.

జిల్లాలో చాలా మంది రైతులకు సాగునీటి వనరులైన నదులు, వాగులు, గెడ్డలు అందుబాటులో లేని పరిస్థితి. వారికి సాగునీరు అందని ద్రాక్షగా మిగులుతోంది. కేవలం వర్షాధారంపై ఆధార పడుతున్నారు. పంటలు వేసి మదుపులు భారీగా పెట్టిన తరువాత వర్షాలు కురవకుంటే నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన గత ప్రభుత్వాలు భూ గర్భ జలాల ద్వారా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులో లేని రైతాంగానికి న్యాయం చేయాలని యోచించాయి. ఇందిర జలప్రభ, ఎన్‌టీఆర్‌ జలకళ పథకాలను అమలు చేశాయి. రాయితీని భారీగా కల్పిస్తూ సోలార్‌ పంపుసెట్లు అందించాయి. ఇప్పటికీ అవి చాలా చోట్ల ఉపయోగపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం కొత్తగా బోర్లు, సోలార్‌ పంపుసెట్లు అందివ్వకపోగా గత ప్రభుత్వాలు అందించిన పంపు సెట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు.

అట్టహాసంగా ప్రారంభం

నియోజవర్గానికి ఒక రిగ్‌బోర్‌ పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవం చేసి రైతులకు ఆశలు కల్పించారు. భారీ స్థాయిలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 1075 మంది లబ్ధిదార్లను మొదటి దశలో అర్హులుగా ఎంపిక చేశారు. 373 మంది రైతులకు మాత్రమే మంజూరు చేశారు. 40మంది రైతులకే విద్యుత్‌ సౌకర్యం, పంపు సెట్లు వేశారు. రిగ్‌ వాహనాలకు భారీగా బిల్లుల పెండింగ్‌ కారణంగా పథకం పడకేసింది. అద్దెకు వచ్చిన రిగ్‌బోర్‌ యజుమానులు వారి లారీలను తరలించుకుపోయారు. రైతులకు నిరాశే మిగిలింది. కాగా అన్నదాతలకు అందించాల్సిన బిందు, తుంపర సేద్యం వంటి సూక్ష్మవ్యవసాయ పరికరాలను సైతం వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. వ్యవసాయ యాంత్రీకరణను రైతులకు దూరం చేసింది. రైతు భరోసాకేంద్రంలో కష్టమైజ్‌ యూనిట్లు అంటూ వైసీపీ నాయకులకే మేలు చేసింది.

Updated Date - Mar 24 , 2024 | 11:45 PM