Share News

తోటపల్లి రెండు కాలువల నుంచి నీరు విడుదల

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:21 AM

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని రెండు కాలువల నుంచి వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాల కోసం అధికారులు నీటిని విడుదల చేశారు.

తోటపల్లి రెండు కాలువల నుంచి నీరు విడుదల

గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని రెండు కాలువల నుంచి వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాల కోసం అధికారులు నీటిని విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల లేమితో పాటు పైనుంచి అంతంత మాత్రంగానే నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.77 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది. అలాగే 2.534 టీఎంసీలకు గాను 1.275 టీఎంసీల నిల్వ నెలకొంది. ఈ పరిస్థితి గత కొన్నాళ్లుగా ఎదురు కాలేదు. ఈ ఏడాది నీటి నిల్వలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం పైనుంచి 280 క్యూసెక్కుల మేర నదిలో నీరు చేరగా, నది మార్గం గుండా 140 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 40 క్యూసెక్కులు, పాత కుడి కాలువ నుంచి 70 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ నుంచి 30 క్యూసెక్కుల మేర నీరు సరఫరా చేస్తున్నారు. ఒక వైపు తీవ్రంగా ఎండలు, మరోవైపు ప్రాజెక్టులో నిల్వలు రోజు రోజుకీ తగ్గడంతో అధికా రుల్లో ఆందోళన నెలకొంది. నదీ తీరంతో పాటు కాలువ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందడంతో తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేశా మని ప్రాజెక్టు జేఈ కిషోర్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 12:22 AM