Share News

స్వేచ్ఛగా ఓటేయండి

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:53 PM

ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. వివాదాస్పద గ్రామంగా ఉన్న లక్షింపేటను ఆమె సోమవారం సందర్శించారు. ఓటుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఆమె వెంటే ఎస్పీ దీపిక కూడా ఉన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేయడానికి తగిన వాతావరణం కల్పిస్తామన్నారు

స్వేచ్ఛగా ఓటేయండి
లక్షింపేటలో పర్యటిస్తున్న అధికారులు

స్వేచ్ఛగా ఓటేయండి

కలెక్టర్‌ నాగలక్ష్మి సూచన

లక్షింపేటలో అవగాహన సదస్సు

వంగర/ రేగిడి, మార్చి 18: ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. వివాదాస్పద గ్రామంగా ఉన్న లక్షింపేటను ఆమె సోమవారం సందర్శించారు. ఓటుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఆమె వెంటే ఎస్పీ దీపిక కూడా ఉన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేయడానికి తగిన వాతావరణం కల్పిస్తామన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఓటరు ఎటువంటి భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకో వాలన్నారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు సెక్టార్‌కు ఒక అధికారిని నియమించామని, పోలీసుల నుంచి కూడా మరో అధికారిని నియమించామని చెప్పారు. ఓటు వేయడంలో తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సెక్టార్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వయో వృద్ధులకు, దివ్యాంగులకు తమ ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు. బాలింతలకు అంగన్‌వాడీ సిబ్బందితో క్రష్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ దీపిక మాట్లాడుతూ ఓటు వేయడానికి ఏమైనా సమస్యలు అడ్డు వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటికే గ్రామంలో 28 మందిని బైండోవర్‌ చేశామని, నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. సదస్సులో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, నియోజకవర్గ ఆర్వో జోసెఫ్‌, ఆర్డీవో శాంతి, డీఎస్పీ చక్రవర్తి ఉన్నారు.

కాగితాపల్లిలో కలెక్టర్‌ తనిఖీ

పోలింగ్‌కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలతో పాటు చుట్టూ రక్షణ చర్యలు పటిష్టంగా ఉండాలని, కాంపౌండ్‌ లేని చోట్ల తాత్కాలిక చర్యలు చేపట్టాలని సిబ్బందికి కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. వంగర నుంచి వస్తూ రేగిడి మండలం కాగితాపల్లిని సోమవారం సందర్శించారు. అక్కడి 120వ బూత్‌ను తనిఖీ చేశారు. ఓటర్ల సంఖ్య, 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలింగ్‌ కేంద్రం చుట్టూ కాంపౌండ్‌ వాల్‌, ర్యాంప్‌ సౌకర్యం, తాగునీటి వసతి లేకపోవడంపై ఆరా తీశారు. తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. బూత్‌ ప్రాంగణంలో నీడ కోసం పోలింగ్‌ రోజున టెంట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

----------

Updated Date - Mar 18 , 2024 | 11:53 PM