Share News

వలంటీర్లతో రాజీనామాలు చేయించాల్సిందే

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:44 AM

వలంటీర్లతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించాలని నియోజకవర్గ వైసీపీ నేతలు గ్రామస్థాయి నాయకులను ఆదేశిస్తున్నారు. ఈ మేరకు వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపుతు న్నారు.

వలంటీర్లతో రాజీనామాలు చేయించాల్సిందే

- గ్రామస్థాయి వైసీపీ క్యాడర్‌కు ముఖ్య నాయకుల ఆదేశాలు

- వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్న నియోజకవర్గ స్థాయి నేతలు

గరుగుబిల్లి: వలంటీర్లతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించాలని నియోజకవర్గ వైసీపీ నేతలు గ్రామస్థాయి నాయకులను ఆదేశిస్తున్నారు. ఈ మేరకు వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపుతు న్నారు. ‘కష్ట కాలంలో ఉన్నాం.. కలిసి రండి’ అని ప్రాథేయపడి.. వలంటీర్లతో రాజీనామా పత్రాలు ఇప్పించాలని సూచిస్తున్నారు. నియోజకవర్గ నేతల ఆదేశాలతో గ్రామస్థాయి నేతలు సంబంధిత వలంటీర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. గురువారం నాటికి పూర్తిస్థాయిలో రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి కార్యకర్తలు కొరత కూడా నెలకొనడంతో వలంటీర్లే వారి దిక్కులా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో బలంతంగా రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని నియమించాం, మేము చెప్పినట్టుగా వ్యవహరించాల్సిందే’ అని మరికొందరు వలంటీర్లకు హుకుం జారీ చేస్తున్నారు. మండల, నియోజకవర్గ, గ్రామస్థాయి నేతలు ఒత్తిడి తేవడంతో పలు గ్రామాల్లోని వలంటీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు నేతలు, మరోవైపు ఎమ్మెల్వోలు ఇదే పనిగా వ్యవహరించడంతో దిక్కు తోచని స్థితిలో వారున్నారు. ‘మళ్లీ వైసీపీ అధికారంలోకి రాగానే వలంటీర్‌కు రూ. 10 వేల చొప్పున గౌరవ వేతనం అందుతుంది.. ప్రస్తుతం రాజీనామా చేసిన వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తాం..’ అని హామీలు గుప్పిస్తున్నారు. గెలుపు బాధ్యత వలంటీర్లపైనే ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే కొందరు వలంటీర్లు మాత్రం రాజీనామాలకు దూరంగా ఉంటున్నారు. అధికంగా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. కాగా ఇప్పటికే రాజీనామాలు చేసిన పలువురు వలంటీర్లు వైసీపీ కండువాలు వేసుకొని ప్రచారంలోకి దిగుతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:44 AM