Share News

వి‘జై’యనగరం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:42 AM

విజయనగరం చారిత్రక పట్టణం. జిల్లా కేంద్రంగా... కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందింది. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో విజయనగరం నియోజకవర్గం ఏర్పడింది. విజయనగరం జిల్లా కేంద్రంగా 1979 జూన్‌ 1న ఆవిర్భవించింది.

వి‘జై’యనగరం

- విజయనగరం ఓటర్ల తీర్పు విలక్షణం..

- ఏడు పర్యాయాలు తెలుగుదేశానిదే హవా

- కాంగ్రెస్‌కు రెండుసార్లే అవకాశం

- ఎక్కువ కాలం పూసపాటి వంశీయుల పరిపాలనలోనే...

- అత్యధికసార్లు విజేత అశోక్‌ గజపతిరాజు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం చారిత్రక పట్టణం. జిల్లా కేంద్రంగా... కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందింది. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో విజయనగరం నియోజకవర్గం ఏర్పడింది. విజయనగరం జిల్లా కేంద్రంగా 1979 జూన్‌ 1న ఆవిర్భవించింది. మొదటి అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో నియోజవర్గ ప్రజలు పూసపాటి రాజ వంశీయుడైన పీవీజీ రాజును గెలిపించారు. జాతీయ కాంగ్రెస్‌ గాలిలో కూడా పీవీజీ రాజు సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగి స్వతంత్ర అభ్యర్ధి గుడివాడ అప్పలస్వామిపై భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. తరువాత 1955లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పీవీజీ రాజు ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున విజయం సాధించారు. 1957లో భట్టం శ్రీరామ్మూర్తి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 62లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా భట్టం గెలుపొందారు. 67లో ఒబ్బిశెట్టి రామారావు భారతీయ జన సంఘ్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అప్పసాని అప్పన్నదొర గెలుపొందారు. విజయనగరం అసెంబ్లీకి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే... జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థులు 1962, 1972లో రెండు పర్యాయాలు మాత్రమే విజయం సాధించగలిగారు.

విద్యల నగరంగా..

విజయనగరం విద్యల నగరంగా వర్థి ్థల్లింది. ఇక్కడ సంస్కృత కళాశాలను రాజులు స్థాపించారు. వేదాలు, ఉపని షత్తులు సంస్కృతంలో చదువుకునేందు కు అనేక మంది దేశం నలుమూలల నుంచి వచ్చేవారు. తదనంతర కాలంలో మహారాజా కళాశాలను స్థాపించారు. న్యాయ కళాశాల, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాలలను రాజులు నెలకొల్పారు. ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు.

కళలకు పుట్టినిల్లు

రాజుల పరిపాలనలో ఉన్న విజయగనరం కళలకు కాణాచిగా ఖ్యాతికెక్కింది. సంగీత, నృత్య కళాశాలను విజయనగరం రాజులు 1955లో స్థాపించారు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని, గాన కోకిల పి.సుశీల, గాన గంధర్వుడు ఘంటసాల వంటివారు ఇక్కడ శిక్షణ పొందినవారే. సాలూరు రాజేశ్వరరావు, వయోలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు ఈ గడ్డలో పుట్టిన వారే. హరికథా పితామహుడు ఆదిబట్ల నారాయణదాసు సంగీత, నృత్య కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ కళాశాలలో శిక్షణ పొందిన వారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు.

వీటితో గుర్తింపు...

విజయగనరం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేవి రాజుల కోట.. గంటస్తంభం... సంస్కృత కళాశాల... సంగీత నృత్య కళాశాల... పెద్ద చెరువు... మూడు లాంతర్లు... పైడి తల్లి అమ్మవారు. ఏటా అమ్మవారి పండగ నిర్వహిస్తున్నారు. పూసపాటి రాజ వంశీయుల ఆడపడుచు పైడితల్లి. రాజుల కాలంలో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే సింహాచల దేవస్థానం.. రామతీర్ధం ఆలయం, పైడితల్లి అమ్మవారు... ఇలా వివిధ ఆలయాలను నిర్మించారు.

ఎమ్మెల్యేలుగా వీరే..

1978లో రాజకీయ అరంగేట్రం చేసిన పీవీజీ రాజు కుమారుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఎదురులేని నాయకునిగా విజయదుందుబి మోగించారు. విజయనగరం ఓటర్లు అశోక్‌ను వరుసగా ఆరు పర్యాయాలు గెలిపించారు. 1983లో ఎన్‌టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో అశోక్‌ టీడీపీలో చేరారు. 1978లో జనతా పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అశోక్‌ 78 (జనతా పార్టీ), 83, 85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ గాలిలో కూడా అశోక్‌ విజయం సాధించారు. ఇలా అశోక్‌ ఏడు పర్యాయాలు విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ఆయన విజయనగరం పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికై మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరించారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు మంజూరులో కీలకపాత్ర పోషించారు. ఇది విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపజేయనుంది.

- 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గాలిలో కూడా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామికి పట్టం కట్టిన విలక్షణ ఓటర్లు విజయనగరం వాసులు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా కోలగట్ల విజయం సాధించి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.

1952 పీవీజీ రాజు సోషలిస్టు పార్టీ

1955 పీవీజీ రాజు ప్రజా సోషలిస్టు పార్టీ

1957 భట్టం శ్రీరామ్మూర్తి సోషలిస్టు పార్టీ

1962 భట్టం శ్రీరామ్మూర్తి కాంగ్రెస్‌

1967 ఒబ్బిశెట్టి రామారావు భారతీయ జనసంఘ్‌

1972 పి.అశోక్‌ గజపతిరాజు జనతా పార్టీ

1983 పి.అశోక్‌ గజపతిరాజు స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ మద్దతు)

1985 పి.అశోక్‌ గజపతిరాజు టీడీపీ

1989 పి.అశోక్‌ గజపతిరాజు టీడీపీ

1994 పి.అశోక్‌ గజపతిరాజు టీడీపీ

1999 పి.అశోక్‌ గజపతిరాజు టీడీపీ

2004 కోలగట్ల వీరభద్రస్వామి స్వతంత్ర అభ్యర్థి

2009 పి.అశోక్‌ గజపతిరాజు టీడీపీ

2014 మీసాల గీత టీడీపీ

2019 కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ

Updated Date - Apr 18 , 2024 | 12:42 AM