Share News

విధుల నిర్వహణలో అప్రమత్తం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:16 PM

ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎన్నికల రాష్ట్ర పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అన్నారు.

  విధుల నిర్వహణలో అప్రమత్తం
జిల్లా అధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా

పార్వతీపురం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎన్నికల రాష్ట్ర పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అన్నారు. పారదర్శకంగా పనిచేసి ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలని సూచించారు. జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన కలెక్టరేట్‌లో పోలీసులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో తప్పులు చేస్తే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లుకు కూడా తావివ్వకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కౌంటింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అరకు పార్లమెంట్‌కు సంబంధించి పాడేరు, రంపచోడవరంలోను కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌శాఖ పరంగా చేపట్టిన వివరాలను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వివరించారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ శంకభ్రత బాగ్చి, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్‌కుమార్‌ మెహర్డ, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్‌ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని, జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:16 PM