Share News

వలంటీర్లపై వేటు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:16 AM

ఎన్నికల కోడ్‌ అడ్డుగా ఉన్నా.. హద్దుమీరిన వలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అత్యుత్సాహంతో అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న 11 మందిపై వేటు వేశారు.

 వలంటీర్లపై వేటు
పాంచాళిలో వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొన్న వలంటీర్లు

పార్వతీపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి)/పాచిపెంట: ఎన్నికల కోడ్‌ అడ్డుగా ఉన్నా.. హద్దుమీరిన వలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అత్యుత్సాహంతో అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న 11 మందిపై వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాచిపెంట మండలం పాంచాళి గ్రామంలో ఈ నెల 19న వైసీపీ కార్యకలాపాల్లో వలంటీర్లు పాల్గొన్నారు. దీనిపై ఎంపీడీవో లక్ష్మీకాంత్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుకు ఫొటోలు కూడా పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎంపీడీవో నివేదికను రూపొందించి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌కు పంపించారు. ఆ తర్వాత వలంటీర్లను సంజాయిషీ కోరుతూ విచారించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో పీవో ఆదేశాల మేరకు పదకొండు మంది వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో గురువారం ఆదేశాలు జారీ చేశారు.

సస్పెండ్‌ అయిన వారు..

మహిసర్ల నాగమణి (క్లస్టర్‌ సీ-5), అంజలి నాగరాజు (క్లస్టర్‌ సి-6), కోరుకొండ అనసూయమ్మ (క్లస్టర్‌ సి-7), కొండగొర్రె వీరబాబు (క్లస్టర్‌ సి-9), సర్లింగి మాధవ (క్లస్టర్‌ సి-10), పారాధి ధనుంజయ్‌ (క్లస్టర్‌ సి-11), పతేడ ఈశ్వరరావు (క్లస్టర్‌ సి-13), ముడారపు మహేష్‌ (క్లస్టర్‌ సి-15), కంది శంకరరావు (క్లస్టర్‌ సి-16), జవ్వాది సత్యనారాయణ (క్లస్టర్‌ సి-17), పతేడ సింహాచలం (క్లస్టర్‌ సి-18)

ఎంఎన్‌వో సస్పెన్షన్‌

పార్వతీపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్‌వోగా పనిచేస్తున్న సీహెచ్‌కిరణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినందుకు కిరణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ‘ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభమవనున్న వైసీపీ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం’ అని ఆయన పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు గాను ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమాళి ఉల్లంఘన, ఉద్యోగి ప్రవర్తనా నిబంధనలు 1964లోని 19(1)(ఏ) మేరకు సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:16 AM