Share News

పట్టణాభివృద్ధి పట్టదా?

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:43 PM

రాజాం పట్టణాభివృద్ధి అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు.

    పట్టణాభివృద్ధి పట్టదా?
ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు

- రాజాంలో పూర్తికాని రోడ్డు విస్తరణ పనులు

- ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, ఫుట్‌పాత్‌లు

- వెలగని సెంటర్‌ లైటింగ్‌

రాజాంరూరల్‌, ఫిబ్రవరి 29: రాజాం పట్టణాభివృద్ధి అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. ఎన్నికల వేళ హడావుడిగా వివిధ పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్న పాలకులు పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, బస్టాండ్‌ ప్రాంతంతో పాటు పట్టణంలోని విలువైన స్థలాలు కళ్లెదుటే ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజాం పట్టణంలో ఆక్రమణలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఫుట్‌పాత్‌లు దాదాపుగా ఆక్రమణకు గురయ్యాయి. కొందరు ఫుట్‌పాత్‌లు ఆక్రమించి పాకలు, బడ్డీలు పెడితే అధికారపార్టీ అండదండలు ఉన్నవారు ఏకంగా కాంక్రీట్‌ కట్టడాలు చేపట్టారు. బజార్‌రోడ్‌, శ్రీనివాస రోడ్‌, మాధవబజార్‌ ప్రాంతాల్లో రహదారులపై తోపుడు బళ్లు నిలిపివేసి వ్యాపారాలు చేస్తుండడంతో కనీసం నడిచేందుకు కూడా వీలుండడం లేదు. మున్సిపల్‌, వ్యవసాయశాఖ, పశు సంవర్థకశాఖ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ప్రాంగణాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. సొంతంగా వ్యాపారాలు చేసేవారు కొందరైతే ఆక్రమించిన స్థలాలను అద్దెకిచ్చి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్న వారు మరికొంతమంది. ఆయాశాఖల అధికారుల మద్దతుతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ కార్యాలయం ప్రాంగణం మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బస్టాండ్‌లో కూడా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. మండల పరిషత్‌కు చెందిన ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో అధికారిక, అనధికారిక ఆక్రమణలున్నాయి. మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి బడ్డీ స్థలం రూ.15 లక్షలు పలుకుతోంది. కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణలకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

కొలిక్కిరాని విస్తరణ

రాజాంలో రెండోవిడత రోడ్డు విస్తరణ పనులు కొలిక్కి రాలేదు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో పనులకు మోక్షం కలగలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు చెల్లించలేదు. ఆస్తులు కోల్పోతున్న యజమానులకు నష్టపరిహారంగా నగదుకు బదులు సీడీఆర్‌ బాండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విస్తరణకు అవసరమైన స్థల సేకరణ సాధ్యం కాలేదు. ఫలితంగా కాలువలు, రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బకాయిలు, యజమానులకు నగదు ఇప్పించి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తిచేసే దిశగా అధికారులు, నాయకులు కృషి చేయలేదు. దీంతో 13 మండలాల ప్రజలు ఏడాదిగా అవస్థలకు గురవుతున్నారు. అలాగే, మరమ్మతులకు గురైన సెంటర్‌ లైటింగ్‌ మరమ్మతుల పనులు ఆరంభశూరత్వంగానే మిగిలిపోయాయి. శ్రీకాకుళం రోడ్‌లోని సప్తగిరి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ ఏర్పాటు చేసిన 110 లైట్లలో 60కి పైగా వెలగలేదు. దీంతో ఆర్నెళ్లుగా మెయిన్‌రోడ్‌లో అంధకారం అలముకుంటోంది.

Updated Date - Feb 29 , 2024 | 11:43 PM