Share News

రోడ్డు మధ్యలో ఇరుక్కున్న లారీలు

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:00 AM

:మండలంలోని గురండి, నేరడి సెంటర్‌ వద్ద రోడ్డు మధ్యలో రెండు లారీలు ఇరుక్కుపోయాయి.

రోడ్డు మధ్యలో ఇరుక్కున్న లారీలు
గురండి వద్ద రహదారిపై ఇరుక్కున్న లారీలు, బారులు తీరిన వాహనాలు

- స్తంభించిన రాకపోకలు

భామిని, జూలై 11:మండలంలోని గురండి, నేరడి సెంటర్‌ వద్ద రోడ్డు మధ్యలో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో బత్తిలి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒడిశా నుంచి కొత్తూరు వైపు వస్తున్న ఇసుక లారీ గురండి సెంటర్‌లో రోడ్డుపై ఉన్న గుంతలో ఇరుక్కుపోయింది. పక్కనే కొంత ఖాళీ మార్గం ఉండడంతో మరో లారీ వెళ్లేందుకు ప్రయత్నించగా అదికూడా కూరుకుపోయింది. దీంతో పూర్తిస్థాయిలో రాకపోకలు స్తంభించిపోయాయి. కొత్తూరు, బత్తిలి వైపు లారీలు బారులు తీరాయి. అలాగే నేరడి బ్యారేజ్‌ సమీపంలో కొత్తూరు వైపు వస్తున్న ఇంకొక లారీ కూడా ఇరుక్కోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గురండి వద్ద ఇరుక్కున్న లారీలను క్రేన్‌ వస్తే గాని ఏమీ చేయలేమని పలువురు పేర్కొంటున్నారు. దీంతో శ్రీకాకుళం, బత్తిలి వైపు వెళ్లే బస్సులు బత్తిలికి 8 కిలోమీటర్ల దూరం నుంచి వెనుదిరుగుతున్నాయి. భారీ లోడ్లకు తోడు గుంతల రోడ్డు కావడంతో వాహనాలు దిగబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొత్తూరు నుంచి బత్తిలి వరకు ఉన్న 30 కిలోమీటర్ల రహదారిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 12:00 AM