Share News

ప్రయాణం నరకమే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:24 AM

అలికాం-బత్తిలి రహదారి నరకానికి అడ్డాగా మారింది. గత ఐదేళ్లుగా ఈ రోడ్డును పాలకులు పట్టించుకోవడం లేదు.

ప్రయాణం నరకమే..
భారీ వాహనాల వెనుక దుమ్ము, ధూళి

- మరమ్మతులకు నోచుకోని అలికాం-బత్తిలి రోడ్డు

- గోతుల్లో సిమెంట్‌ డస్ట్‌ వేసిన వైనం

- దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

భామిని, ఏప్రిల్‌ 7: అలికాం-బత్తిలి రహదారి నరకానికి అడ్డాగా మారింది. గత ఐదేళ్లుగా ఈ రోడ్డును పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు భామిని మండలం మీదుగా ప్రయాణం చేయడం నరకప్రాయమని సరిహద్దు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. బత్తిలి నుంచి కొత్తూరు వరకు 30 కిలోమీటర్ల రహదారి పూర్తిగా గోతుమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు మొరపెట్టుకోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మెటల్‌తో గోతులను పూడ్చారు. మధ్యమధ్యలో బీటీ రోడ్డును తొలగించి సిమెంట్‌ డస్ట్‌తో కలిపి మెటల్‌ వేశారు. సింగిడి నుంచి బిల్లుమడ వరకు రెండు కిలోమీటర్లు, ఘనసర నుంచి కొరమ వరకు సుమారు ఐదు కిలోమీటర్లు రోడ్డును తవ్వి సిమెంట్‌ మెటల్‌ వేశారు. దీంతో రహదారిపై వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము దూళి ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడుతుండడంతో నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా తారు మెటీరియల్‌తో గోతులను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ జగన్మోహన్‌రాజు వివరణ కోరగా.. ‘రోడ్డు మరమ్మతులకు రూ.3.5 కోట్లు మంజూరయ్యాయి. రూ.80 లక్షల వరకు కాంట్రాక్టర్‌ పనిచేశాడు. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రయత్నిస్తున్నాం. బిల్లులు చెల్లించిన వెంటనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని’ తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 12:24 AM