ఓటర్లకు ప్రయాణ కష్టాలు
ABN , Publish Date - May 12 , 2024 | 11:34 PM
తమ ఓటు హక్కును వినియోగించేందుకు చేరుకున్న ప్రయాణికులతో జిల్లాలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. అయితే ఎప్పటిలానే వారికి ప్రయాణ కష్టాలు తప్పలేదు.

పార్వతీపురం టౌన్, మే 12 : తమ ఓటు హక్కును వినియోగించేందుకు చేరుకున్న ప్రయాణికులతో జిల్లాలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. అయితే ఎప్పటిలానే వారికి ప్రయాణ కష్టాలు తప్పలేదు. ఆదివారం జిల్లా కేంద్రం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రజలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో స్సులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతూ.. వారంతా తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. కొందరు బస్సుల్లో సీట్ల కోసం పోటీపడ్డారు. మరికొందరు ఫుట్‌పాట్‌పై నిల్చొని గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అధిక శాతం బస్సులను ఎన్నికల నిర్వహణకు కేటాయించడంతో జిల్లాకేంద్రవాసులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వలస ఓటర్లు పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. ఈ విషయమై ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గను వివరణ కోరగా అవకాశం ఉన్నంత వరకు బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు.