ఏనుగులకు చిక్కి.. విగతజీవిగా మారి..
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:14 AM
పార్వతీపురం మండలం పెదబొండపల్ల్లి గ్రామానికి చెందిన దేవాబత్తుల యాకోబు(74) గురువారం ఏనుగుల దాడిలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

బెలగాం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం పెదబొండపల్ల్లి గ్రామానికి చెందిన దేవాబత్తుల యాకోబు(74) గురువారం ఏనుగుల దాడిలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూలానే పొలం పనులకు వెళ్లిన యాకోబు వాటిని ముగించుకుని ఇంటికి తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యంలో ఏనుగులు ఆయనపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే యాకోబు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడికి చెవులు వినకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలియజేస్తున్నారు. యాకోబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్‌ఐ సంతోషి కుమారి తెలిపారు.
భయాందోళనలో గ్రామస్థులు
ఏనుగుల దాడి సంఘటనతో గ్రామస్థులు హడలెత్తిపోతున్నారు. అవి ఎప్పుడు ఎవరిమీద దాడి చేస్తాయోనని భయందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిలో ఇప్పటివరకు జిల్లాలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇంకొకరు బలయ్యారు. తక్షణమే అటవీశాఖ ఉన్నతాధి కారులు స్పందించి గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.