Share News

ఏకతాటిపైకి..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:04 AM

కూటమి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు, అభ్యర్థులు ఒకేతాటిపై వస్తున్నారు. దాదాపు అందరూ ఒక్కటయ్యారు. కొద్దిమేర అసంతృప్తికి లోనైన వారు కూడా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు.

ఏకతాటిపైకి..

ఏకతాటిపైకి..

కూటమి ఆధ్వర్యంలో ఒక్కటవుతున్న నేతలు

అసంతృప్తిని వీడి జనంలోకి

వైసీపీని వీడని అసమ్మతి గళం

బొత్స సమావేశానికి ఎమ్మెల్సీ డుమ్మా

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

కూటమి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు, అభ్యర్థులు ఒకేతాటిపై వస్తున్నారు. దాదాపు అందరూ ఒక్కటయ్యారు. కొద్దిమేర అసంతృప్తికి లోనైన వారు కూడా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటున్నారు. అదే వైసీపీలో చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఇంకా చల్లార లేదు. తాజాగా ఎస్‌.కోట నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ రఘురాజుతో సహా ఆయన అనుచరులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీపై బొత్స పరోక్షంగా విమర్శలు చేశారు. ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేయాలంటూ విమర్శించారు. అలాగే బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో వైసీపీకి చెందిన కోట్ల సుగుణాకరరావు టీడీపీలో చేరారు. మెరకముడిదాం మండలంలో కోట్ల కుటుంబానికి చెందిన వారే బొత్స, చిన్న శ్రీనులకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. కోట్ల కుటుంబంలో చీలిక రావటంతో వైసీపీకి నష్టమేనన్న వాదన విన్పిస్తోంది. విజయనగరం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్లకు నగరంలో బలమైన అసమ్మతి ఉంది. కీలక వైసీపీ నాయకులు ఇటీవల వరుసగా టీడీపీలో చేరారు.

తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడిన కారణంగా సీట్ల కేటాయింపుల ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు టిక్కెట్టును ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనుచరులు సైతం అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌లు సంప్రదింపులు జరిపి భవిష్యత్‌పై స్పష్టమైన భరోసా ఇచ్చారు. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి లోకం నాగమాధవితో ప్రచారంలో పాల్గొంటున్నారు.

- చీపురుపల్లి నియోజకవర్గ టిక్కెట్టును ఆశించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకూ నిరాశ ఎదురైంది. అసమ్మతి గళాన్ని విప్పారు. దీంతో చంద్రబాబు, లోకేశ్‌లు కబురు పెట్టి పరిస్థితిని వివరించారు. నాగార్జునతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం రెండు మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని నాగార్జున చెప్పినట్లు సమాచారం. అయితే కళావెంకట్రావు ప్రచారాన్ని ప్రారంభించారు. చీపురుపల్లిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కళావెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారు.

- గజపతినగరం సీటును మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు ఆశించారు. అయితే ఆయన సోదరుని కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకు సీటు దక్కింది. దీంతో కేఏ నాయుడు విజయవాడలోనే మకాం వేసి సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా కేఏ నాయుడుకి వ్యతిరేకంగా ఇదే నియోజకవర్గంలో మరో గ్రూపు నడిపిన రాష్ట్ర పార్టీ నాయకుడు శివరామకృష్ణ కూడా విజయవాడలో ఉన్నారు. వీరు ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబును కలిశారు. ఏ హామీ ఇచ్చారు అన్నది తెలియాల్సి ఉంది. ఇలా టీడీపీలో అసమ్మతిని చల్లారుస్తూ పార్టీ కేడర్‌ను అధినేత చంద్రబాబు ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. మరోవైపు జిల్లాలో అశోక్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి వస్తున్న నాయకులతో అశోక్‌ బంగ్లా నిత్యం సందడిగా కన్పిస్తోంది.

------------

Updated Date - Apr 08 , 2024 | 12:04 AM