Share News

సమరానికి నేడే ఆరంభం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:48 AM

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టినా.. అసలైన సమరం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక్కడి నుంచి పోలింగ్‌ రోజు వరకు ప్రతి క్షణమూ విలువైనదే. నామినేషన్‌ దాఖలు నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు అటు ఓటరు కరుణ పొందడానికి ప్రయత్నించడంతో పాటు ఇటు ఎన్నికల నిబంధనలు పాటించడం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే.

సమరానికి నేడే ఆరంభం

- సార్వత్రిక ఎన్నికలకు వేళాయే

- నేటి నుంచి నామినేషన్లు

- 25 వరకు స్వీకరణ

- మే 13న పోలింగ్‌

- జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టినా.. అసలైన సమరం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక్కడి నుంచి పోలింగ్‌ రోజు వరకు ప్రతి క్షణమూ విలువైనదే. నామినేషన్‌ దాఖలు నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు అటు ఓటరు కరుణ పొందడానికి ప్రయత్నించడంతో పాటు ఇటు ఎన్నికల నిబంధనలు పాటించడం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు.. నిబంధనలను పరిశీలిద్దాం.

ముఖ్యమైన తేదీలు

- నామినేషన్ల దాఖలు: ఏప్రిల్‌ 18 నుంచి 25

- నామినేషన్ల పరిశీలన: 26

- ఉపసంహరణ: 29

- పోలింగ్‌: మే 13

- ఓట్ల లెక్కింపు: జూన్‌ 4

(శృంగవరపుకోట/కొమరాడ)

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వయస్సు 25 ఏళ్లు నిండి.. భారత పౌరుడై ఉండాలి. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందినరాజకీయ పక్షాల తరఫున పోటీ చేసే వారి అభ్యర్థిత్వాన్ని ఒకరు బలపరచాలి.

- బలపరిచిన అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో ఓటరుగా ఉండాలి. పేరు, పోలింగ్‌ కేంద్రం, ఓటరు జాబితాలో వరుస సంఖ్య, వంటి ఆంశాలను ప్రస్తావించాలి.

- స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం పది మంది ఓటర్లు బలపరచాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 33(1) ప్రకారం ఇది తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన ఇంకా గుర్తింపు లేని పార్టీలు (రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నెజ్డ్‌) నుంచి పోటీ చేసే అభ్యర్ధులకు కూడా పది మంది బలపరిచేవారు ఉండాలి. లేదంటే నామినేషన్‌ను తిరస్కరిస్తారు. నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు లేకపోయినా ప్రతిపాదన చెల్లదు.

మూడు వాహనాలే..

అభ్యర్థులు ప్రచారానికి మూడు వాహనాలను మాత్రమే వినియోగించాలి. వీటికి ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. వాహనాలు ఎక్కువ ఉంటే ఎన్నికల సంఘం చర్యలకు గురవుతారు. అభ్యర్థి వ్యయంలో నమోదు చేస్తారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

- అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించకూడదు.

- దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఓట్లు అడగరాదు. ఓటర్లకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురిచేయరాదు.

- ఎన్నికల ప్రచార సమయంలో ఇరు పార్టీలు ఎదురురెదుగా రాకూడదు. ఒక పార్టీ ప్రచార ప్రతులను మరో పార్టీ చించకూడదు.

- సమస్యలపై ధర్నాలు, ర్యాలీలు, సభలు వంటివి నిర్వహించకూడదు.

- అధికారుల అనుమతితో లౌడ్‌ స్పీకర్లు వినియోగించాలి.

- పాఠశాలలు, ప్రార్ధనా మందిరాల వద్ద ప్రచారాలు నిషేఽథం.

నామినేషన్‌ ఫీజు ఇలా..

శాసనసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు (జనరల్‌) డిపాజిట్‌గా రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5వేలు చెల్లించాలి. ఎంపీ అభ్యర్థులు (జనరల్‌) రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.12,500, చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌ మొత్తం నగదు రూపంలో నామినేషన్‌ సమర్పించిన సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యయం ఇలా...

శాసన సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.40 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అంతకు మించి వ్యయమైతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.

నామినేషన్‌ పత్రాల దాఖలు ఇలా..

- నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉండే తహసీల్దార్‌ కార్యాలయానికి కనీసం వంద మీటర్ల దూరంలో ర్యాలీలు నిలిపివేయాలి. అభ్య ర్థితో పా టు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.

- నామినేషన్‌ దాఖలు చేయడానికి 48 గంటల ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వారి పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెర వాలి. ఆ ఖాతా ద్వారానే ఎన్నికల ప్రచారానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిం చాలి. ఖాతా పుస్తకం ప్రతిని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి.

- విద్యార్హతలు, నేర చరిత్ర, ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు అందించాలి. నేర చరిత్ర కలిగి, కోర్టుల్లో కేసులు ఉన్నవారు నేర వివరాల సంఖ్యను ప్రస్తావించాలి. పార్లమెంటు అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు సమర్పించాలి.

- ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రాజీనామాను ఆమోదించినట్లు ప్రభు త్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్‌తో పాటు దాఖలు చేయాలి.

- అభ్యర్థులు ఇంటి, నీటి పన్ను, విద్యుత్‌ చార్జీల బిల్లు బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.

Updated Date - Apr 18 , 2024 | 12:48 AM