Share News

నేడు ఎల్లమాంబ సిరిమానోత్సవం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:40 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, మండలంలోని మరుపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమాంబ తల్లి సిరిమానోత్సవం సోమవారం జరగనుంది.

నేడు ఎల్లమాంబ సిరిమానోత్సవం

గజపతినగరం, మార్చి 24: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, మండలంలోని మరుపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమాంబ తల్లి సిరిమానోత్సవం సోమవారం జరగనుంది. దీనికోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ ఏడాది మహా శివరాత్రి వెళ్లిన తరువాత గ్రామంలో ఎల్లమాంబ తల్లి సిరిమానోత్సవం జరగనుంది. శ్రీకాకుళం జిల్లా వంబరిల్లి గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తరువాత జామి గ్రామానికి తరలివెళ్లింది. అనంతరం మరుపల్లి గ్రామంలోని గెద్దవారి కుటుంబంలో వెంకట్లనాయుడు, అప్పలనాయుడు ఇంట కొలువుదీరింది. ముందుగా ఎల్లమాంబ, పరశురాముడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం సాయంత్రం 4 గంటలకు సిరిమానోత్సవాన్ని ప్రారంభించనున్నారు. మండలంలోని తమ్మారాయుడు పేట గ్రామానికి చెందిన తలారి రామునాయుడు కళ్లం నుంచి తీసుకువచ్చిన సిరిమానును ఎల్లమ్మ తొలి పూజారిగా కర్నకోట కసవయ్య, రెండో పూజారిగా రుద్రాక్షుల సత్యం, మూడో పూజారిగా కర్నకోట వెంకట్లు అధిరోహిస్తారు. సిరిమానోత్సవానికి రాష్ట్రంతో పాటు ఒడిశా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సర్పంచ్‌ లెంక రామలక్ష్మి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తూ వైద్య సేవలను నిరంతరం అందించే విధంగా పీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణారెడ్డి చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందో బస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకరరావు తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 11:40 PM