Share News

నేడే కౌంటింగ్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:32 PM

జిల్లాలో మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్కంఠకు తెరపడనుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

నేడే  కౌంటింగ్‌
ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన టేబుళ్లు

తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం

సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం

పార్వతీపురం, జూన్‌3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్కంఠకు తెరపడనుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇది జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. అరకు పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పర్యవేక్షణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

తొలిసారిగా జిల్లాలో...

జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ‘మన్యం’లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నారు. గతంలో విజయనగరంలో లెక్కించేవారు. కాగా ఈసారి పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు, పోస్టల్‌ బ్యాలెట్లను గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. అరకు పార్లమెంట్‌ పరిధి పాడేరు, రంపచోడవరం, అరకు నియోజకవర్గాలను చెందిన పోస్టల్‌ బ్యాలెట్లను కూడా ఇక్కడే లెక్కించనున్నారు. కౌంటింగ్‌ ప్రకియ ప్రారంభించే ముందు ఉల్లిభద్రలో ఇతర ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే ముందుగానే గ్రామం నుంచి వెళ్లిపోవడం మంచిది. లేకుంటే అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఫలితాలు ఇలా..

పార్వతీపురం నియోజకవర్గం పరిఽధిలో 233 పోలింగ్‌ క్రేందాలకు సంబంధించి 17 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. ఈ నియోజకవర్గంలో 1,89,817 ఓట్లకు గాను 1,48,502 ఓట్లు పోలయ్యాయి. సాలూరు నియోజకవర్గ పరిధిలో 243 పోలింగ్‌ బూత్‌లు ఉండగా.. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈ నియోజకవర్గంలో 2,04,489 ఓట్లకు గాను 1,56,331 ఓట్లు పోలయ్యాయి. కురుపాం నియోజకవర్గంలో 268 పోలింగ్‌ కేంద్రాలకు గాను 20 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. 1,94,114 ఓట్లకు గాను 1,52,452 ఓట్లు పడ్డాయి. పాలకొండ నియోజకవర్గంలోని 287 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓట్లు లెక్కింపు ఉంటుంది. 21 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. ఇక్కడ 1,95,020 ఓట్లు ఉండగా 1,46,781 ఓట్లు పోలయ్యాయి. కాగా జిల్లా పరిధిలో 77.10 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. సాలూరు నియోజకవర్గం ఓట్లు లెక్కింపు సుమారు 9 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీని ఫలితం సాయంత్రం నాలుగు గంటలలోపు అధికారికంగా ప్రకటించవచ్చు. కురుపాం నియోజకవర్గం ఫలితం సాయంత్రం ఆరు గంటల తర్వాత , పాలకొండ నియోజకవర్గం ఫలితం రాత్రి ఏడు గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్‌లో ఓట్లు లెక్కింపునకు సంబంధించి సుమారు 30 నిమిషాల పైబడి సమయం పట్టొచ్చు. కౌంటింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల్లోపు పూర్తయితే సాయంత్రం నాలుగు గంటలకు పూర్తిస్థాయిలో రిటర్నింగ్‌ అధికారి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ప్రత్యేక పాస్‌లు ఉంటేనే అనుమతి...

ప్రత్యేక పాస్‌లు ఉంటేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు అనుమతి ఇస్తారు. ఏజెంట్లు వారికి కేటాయించబడిన టేబుల్స్‌ వద్ద ఉండాలి. కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు బయటకు రాకూడదు. ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలి. ఏజెంట్లకు ఏమైనా సందేహాలుంటే టేబుల్‌ వద్ద ఉండే సూపర్‌వైజర్‌ లేదా ఇతర అధికారి ద్వారా రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు తప్పదు...

ఏ అభ్యర్థి తరపు ఏజెంట్‌గా వెళ్లినా ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌంటింగ్‌ కేంద్రం వద్దే ఉండాలి. ఓట్ల లెక్కింపు సిబ్బంది చెప్పిన తర్వాతే బయటకు వెళ్లాలి. నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారాజ్యంగా కౌంటింగ్‌ కేంద్రంలో వ్యవహరిస్తే ఆర్వో ఆదేశాల మేరకు వెంటనే అరెస్టు చేయనున్నారు. అభ్యర్థుల తరపున వెళ్లే ప్రతి ఏజెంట్‌ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

పటిష్ఠ బందోబస్తు

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు మధ్య జరుగుతుంది. ఎస్పీ విక్రాంత్‌ పటిల్‌ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ తదితర కేంద్ర బలగాలు కూడా కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నాయి. సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

Updated Date - Jun 03 , 2024 | 11:32 PM