Share News

నేడే కౌంటింగ్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:20 PM

సుదీర్ఘ నిరీక్షణకు.. నరాలు తెగే ఉత్కంఠకు.. మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో.. పరాజితులెవరో తేలబోతోంది. ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో.. ఎవరిని తిరస్కరించారో.. ఎవరికి పట్టం కట్టారో ఎవరిని దూరం పెట్టారో.. వెల్లడికాబోతోంది.

నేడే కౌంటింగ్‌
జేఎన్‌టీయూలో కౌంటింగ్‌ హాలు

నేడే కౌంటింగ్‌

మహా తీర్పు కోసం ప్రజలంతా నిరీక్షణ

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

అందరిలో ఒకటే టెన్షన్‌

విజయంపై ఇరుపార్టీల్లోనూ ధీమా

అసెంబ్లీ పోటీలో 77 మంది

లోక్‌సభ బరిలో 15 మంది

సుదీర్ఘ నిరీక్షణకు.. నరాలు తెగే ఉత్కంఠకు.. మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో.. పరాజితులెవరో తేలబోతోంది. ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో.. ఎవరిని తిరస్కరించారో.. ఎవరికి పట్టం కట్టారో ఎవరిని దూరం పెట్టారో.. వెల్లడికాబోతోంది. ఎవరి ఆశలు ఫలించాయో.. ఎవరికి నిరాశ మిగిలిందో.. ఈవీఎంలు చెప్పబోతున్నాయి. గెలుపు గుట్టు విప్పబోతున్నాయి. మరికొద్ది సేపట్లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మంగళవారం మధ్యాహ్నానానికి అభ్యర్థుల విజయావకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులతో పాటు వైసీపీ అభ్యర్థులూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ రాజాం రూరల్‌/ కలెక్టరేట్‌/ క్రైం:

జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాలతో పాటు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఎన్నికల బరిలో ఎంతమంది అభ్యర్థులున్నా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే అన్నది అందరూ అంగీకరించే సత్యం. ఏడు అసెంబ్లీ స్థానాల్లో 77మంది పోటీలో ఉన్నారు. విజయనగరం లోక్‌సభకు 15మంది పోటీ పడ్డారు. రాజాం నియోజకవర్గంలో 10మంది, బొబ్బిలి 8, చీపురుపల్లి 7, గజపతినగరం 13, నెల్లిమర్ల 12, ఎస్‌.కోట 12, విజయనగరం నియోజకవర్గంలో 15 మంది పోటీ పడ్డారు. విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరగనుంది. మిగిలిన నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తారు. జిల్లాలో 15,62,921 మంది ఓటర్లున్నారు. ఇందులో 12,71,173 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- జిల్లాలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలో 21,836 పోస్టల్‌ బ్యాలెట్లకు ఎన్నిల సంఘం అనుమతిచ్చింది. ఇందులో 19,738 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో 21,472 మంది పోస్టల్‌ బ్యాలెట్లకు గాను 19545 మంది ఓటేశారు.

నువ్వా... నేనా..

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీలు నువ్వా, నేనా అన్నట్లు ఢీకొన్నాయి. అధికార పార్టీ మద్యం,

డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసింది. ఈ నేపధ్యంలో ఏడు సీట్లూ తమవేనని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. అయితే వైసీపీ ఆగడాలకు టీడీపీ అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకెళ్లారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలతో మహిళల మనసుల్ని గెలిచారు. లాండ్‌ టైట్‌లింగ్‌ యాక్ట్‌ వల్ల కలగనున్న అనర్థాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. విజయం దిశగా అడుగులు వేశారు.

పకడ్బందీగా లెక్కింపు: కలెక్టర్‌

ఓట్ల లెక్కింపులో నిబంధనలను పక్కాగా పాటించాలని విజయనగరం పార్లమెంట్‌ ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు సిబ్బందికి సోమవారం శిక్షణ ఇచ్చారు. లెక్కింపు పూర్తి అయ్యేవరకూ సిబ్బంది ఎవ్వరూ పొలిటికల్‌ ప్రతినిధులతో ఎలాంటి సంభాషణలు జరపకూడదని, విరామానికి వెళ్లినా తిరిగి మాట్లాడకుండా రావాలని చెప్పారు. కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్‌లు, అభ్యర్థులు ఎలాంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలను కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు తీసురాకూడదని తెలిపారు. ఏజెంట్లు కూర్చునే కుర్చీలపై జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు చెందిన ఏజెంట్లకు ప్రతి టేబుల్‌ వద్ద వరుస క్రమంలో సిటింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని తెలిపారు. కౌంటింగ్‌ హాల్‌ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఫొటో ఐడెంటిటీ తప్పనిసరి అని స్పష్టంచేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటు వేసిన వారి వివరాలను బయటకు వెల్లడి కాకుండా చూడాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సిబ్బందిపై ఉందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి గజిటెడ్‌ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, పేరు డిజిగ్నేషన్‌ అవసరం లేదని, అయితే ఈటిపిబిఎస్‌పై మాత్రం తప్పసరిగా డిజిగ్నేషణ్‌, స్టాంప్‌ ఉండాలని తెలిపారు.

నిరంతరం అప్రమత్తం: ఎస్పీ

కౌంటింగ్‌ విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ దీపిక అన్నారు. కౌంటింగ్‌ కే ందాలైన లెండీ, జెఎన్జీయూలను అమె సోమవారం పరిశీలించారు. అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గుర్తింపుకార్డు పరిశీలించాకే లోపలకు అనుమతించాలని చెప్పారు. సెల్‌ఫోన్‌తో సహా ఎలాకా్ట్రనిక్‌ గాజ్డెట్స్‌ను తీసుకురాకూడదన్నారు. నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్‌ చేయించాలని, 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడదని చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులేవన్నారు. ఆమె వెంట ఏఎస్పీ అస్మాపరహీన్‌, ట్రైనీ ఐపీఎస్‌ జావలి ఆల్పాన్స్‌ తదితరులు ఉన్నారు.

ధ్వంసమైన బోర్డులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, హోర్డింగ్‌లు, సూచిక బోర్డులు కూలిపోయాయి. పార్కింగ్‌ స్థలాల్లో కూడా వర్షపు నీరు నిలిచిపోయి చిత్తడిగా మారింది. వైద్య సేవలు అందించే శిబిరం మార్చాల్సి వచ్చింది. మంగళవారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పటిష్టమైన టెంట్లను ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలట్‌లు, ఈవీఎంలు కౌంటింగ్‌ జరిగే బ్లాకుల్లో ఇనుప కంచెలతో పటిష్ట భద్రత, చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేఽశారు.

Updated Date - Jun 03 , 2024 | 11:20 PM