Share News

‘ కుంకీ’లతో కట్టడి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:02 AM

జిల్లావాసులకు ఏనుగుల బెడద తొలగిపోనుందా..? ఆస్తి, ప్రాణ, పంట నష్టాలకు చెక్‌ పడనుందా.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం కానుందా! అంటే అవునని సమాధానమిస్తున్నారు అటవీశాఖాధికారులు..

‘ కుంకీ’లతో కట్టడి
అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు

దీర్ఘకాలిక సమస్యపై దృష్టి సారించిన టీడీపీ కూటమి ప్రభుత్వం

కుంకీ ఏనుగులను తెప్పించేందుకు అటవీ శాఖాధికారుల ప్రతిపాదనలు

సీతంపేట,జూలై 27 : జిల్లావాసులకు ఏనుగుల బెడద తొలగిపోనుందా..? ఆస్తి, ప్రాణ, పంట నష్టాలకు చెక్‌ పడనుందా.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం కానుందా! అంటే అవునని సమాధానమిస్తున్నారు అటవీశాఖాధికారులు.. మన్యం జిల్లాలో ఏనుగులు పంటలను నాశనం చేయడం, జనావాసాల్లోకి రావడంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ఇటీవల అటవీ శాఖ అధికారులతో చర్చించారు. గజరాజుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు కుంకీ ఏనుగులు అవసరమని తెలిపారు. కాగా కర్ణాటకలో ఉన్న వాటి కోసం.. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కుంకీ ఏనుగులను తెప్పించేందుకు కృషి చేస్తామని పవన్‌ చెప్పారు. అయితే ‘మన్యం’లో విధ్వంసం సృష్టిస్తున్న గజరాజుల నియంత్రణకు రెండు కుంకీ ఏనుగులు అవసరమని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వాటిని జిల్లాకు తెప్పించడానికి అవసరమైన నివేదికలు రూపొందించారు. ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించారు. కాగా టీడీపీ నూతన ప్రభుత్వం ఏనుగుల సమస్యపై దృష్టిసారించడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

మన్యం జిల్లాలోకి 2007లో 11 ఏనుగులు ప్రవేశించాయి. ఒడిశా రాష్ట్రం లఖేరీ అడవుల నుంచి సీతంపేట, భామిని మండలాలకు చేరుకున్నాయి. అప్పటి నుంచి వేల ఎకరాల్లో పంటలు, పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని చెప్పొచ్చు. ఏనుగుల దాడిలో అటవీశాఖకు చెందిన ట్రాకర్లు కూడా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో ఆరు, సీతంపేట , భామిని సరిహద్దుల్లో మరో నాలుగు గజరాజులు సంచరిస్తున్నాయి. పగలంతా పంట పొలాలు, తోటల్లో సంచరించే ఏనుగులు.. రాత్రి వేళల్లో జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జిల్లావాసులు హడలెత్తిపోతు న్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గజరాజులు ప్రధాన రహదారులపై కూడా సంచరిస్తుండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

ఏనుగుల మృత్యువాత..

మన్యం జిల్లాలో ఏనుగుల సంరక్షణ చర్యలు కొరవడ్డాయని చెప్పొచ్చు. గత వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. భామిని మండలంలో నాలుగు ఏనుగులు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాయి. గతంలో లఖేరీ అడవులకు తరలిస్తుండగా రెండు ఏనుగులు చనిపోయాయి. గరుగుబిల్లి మండలంలో అనారోగ్యంతో ఒక ఏనుగు, వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురంలో రెండు ఏనుగులు మృతి చెందాయి. ఒంటరి ఏనుగు జాడ కనిపించడం లేదు.

నియంత్రణకు చర్యలు

ఏనుగులను నియంత్రించడం అటవీశాఖకు కష్టతరంగా మారింది. సరిహద్దులో ఉన్న ఒడిశా అటవీ ప్రాంతానికి వాటిని తరలించడానికి అధికారులు ప్రయత్నించారు. అయితే ఆ రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది నుంచి వ్యతిరేకత రావడంతో ఏనుగులు తరలింపు నిలిచిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం ఎలిఫెంట్‌ జోన్‌ అంటూ హడావుడి చేసి.. ప్రకటనలకే పరిమితమైంది. మరోవైపు ఏనుగులు జనావాసాల్లోనే యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేసి రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ ఇటీవల అటవీశాఖాధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏనుగులను నియంత్రించి... దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా రెండు కుంకీ ఏనుగులను జిల్లాకు తెప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయమై అటవీశాఖ రేంజర్‌ మణికంఠను వివరణ కోరగా.. రెండు కుంకీ ఏనుగుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

కుంకీ ఏనుగులు ఏం చేస్తాయంటే..

మావటీల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల ద్వారా అటవీ ఏనుగులను నియంత్రిస్తారు. మావటీలు చెప్పే విధంగానే కుంకీ ఏనుగుల కదలికలు ఉంటాయి. వాటిని కేరళ, గౌహతి ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి మావటీల ఆధీనంలోనే ఉంచుకుంటారు. అటవీ ఏనుగులు అలజడి సృష్టించేటప్పుడు కుంకీ ఏనుగులను పంపించి పరిస్థితిని అదుపులోకి తెస్తారు. గతంలో జయంతి, గణేష్‌ అనే రెండు కుంకీ ఏనుగులను జిల్లాకు తెప్పించారు. అటవీశాఖ నేతృత్వంలో వాటితో సీతంపేట, జియ్యమ్మవలస మండలాల్లో ఆపరేషన్‌ గజేంద్ర నిర్వహించారు. అప్పట్లో రెండు ఏనుగులను ఒడిశా రాష్ట్రం లఖేరికి పంపించారు. అయితే అక్కడ అవి చనిపోవడంతో ఆపరేషన్‌ గజేంద్రకు బ్రేక్‌ పడింది.

Updated Date - Jul 28 , 2024 | 12:02 AM