మూడు గంటలు.. ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:08 PM
రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ లారీ ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో గుమడ గ్రామం దగ్గర అంతర్రాష్ట్ర రహదారిపై గోతిలో దిగబడింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

భారీగా నిలిచిపోయిన వాహనాలు
పోలీసుల చొరవతో యథావిధిగా రాకపోకలు
కొమరాడ, జూలై 28 : పార్వతీపురం-కూనేరు అంతర్రాష్ట్ర రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఈ మార్గంలో ఏర్పడిన భారీ గుంతల్లో రోజుకో వాహనం దిగబడుతోంది. దీంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలుగు రాష్ట్రాలకు ఇదే కీలక మార్గం. కొమరాడ మండల ప్రజలకు కూడా ఇదే ప్రధాన రహదారి. అయినప్పటికీ ఈ రోడ్డు మరమ్మతు, నిర్వహణపై గత వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఐదేళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రహదారి మరింత అధ్వానంగా మారింది.. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి. తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండగా, వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ లారీ గుమడ గ్రామం దగ్గర అంతర్రాష్ట్ర రహదారిపై గోతిలో దిగబడింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒడిశా, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాహనాలు బారులుదీరాయి. విషయం తెలుసుకున్న కొమరాడ పోలీసులు అక్కడకు చేరుకుని.. ఎక్స్‌కవేటర్ సాయంతో గోతిలో దిగబడిన లారీ పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత యథావిధిగా వాహనాల రాకపోకలు సాగాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి.. రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు, వాహనదారులు కోరుతున్నారు.