Share News

మూడు రోజులూ.. అవస్థలే!

ABN , Publish Date - May 16 , 2024 | 11:39 PM

జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది ఆది నుంచీ కష్టాలు పడ్డారు. మూడు రోజుల పాటు ఆపసోపాలు పడ్డారు. ఈవీఎంలు అప్పగించే వరకు నానా అవస్థలు పడ్డారు.

మూడు రోజులూ.. అవస్థలే!
పోలింగ్‌ మరుసటి రోజు ఉద్యాన కళాశాల ఆవరణలో ఉద్యోగులు ఇలా.. (ఫైల్‌)

కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత

తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు నిల్‌

భోజనాలు, నిద్రకు కరువు

ఈవీఎంలతో పోలింగ్‌స్టేషన్ల నుంచి

కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకునేందు ఇక్కట్లు

రెమ్యూనరేషనూ అంతంతే...

పెదవి విరుస్తున్న ఉద్యోగులు

పార్వతీపురం, మే16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది ఆది నుంచీ కష్టాలు పడ్డారు. మూడు రోజుల పాటు ఆపసోపాలు పడ్డారు. ఈవీఎంలు అప్పగించే వరకు నానా అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపో వడంతో నిద్రకు, భోజనాలకు కరువై.. నరకయాతన అనుభవించారు. ఆఖరికి రెమ్యూనరేషన్‌ కూడా అంతంతమాత్రంగా అందించడంతో ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది ఈనెల 12న ఉదయాన్నే పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకున్నారు. అక్కడ వారికి అందించిన ఈవీఎం, పోలింగ్‌ మెటీరియల్‌ను స్వీకరించారు. అనంతరం వారికి కేటాయించిన బస్సుల్లో గమ్యస్థానానికి చేరుకున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. మరుసటి రోజున 13వ తేదీ ఉదయం 5.30కి ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అయితే అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ కాస్త జాప్యమైంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద రాత్రి ఎనిమిది గంటల వరకు ఓటింగ్‌ కొనసాగిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పోలింగ్‌ రోజు సాయంత్రం వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ అతి కష్టం మీద పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సిబ్బందికి అవస్థలు తప్పలేదు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత వారు ఈవీఎంలను పట్టుకుని స్ర్టాంగ్‌ రూములకు బయల్దేరగా.. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన బస్సులన్నీ ఒకేసారి రావడంతో ట్రాఫిక్‌ జాం అయ్యింది. దీంతో గరుగుబిల్లి మండలం ఉద్యాన కళాశాల ఆవరణలోనే రాత్రి 8 నుంచి అర్ధరాత్రి సమయం వరకు బస్సుల్లోనే సిబ్బంది వేచి ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో రాత్రి భోజనానికి వారు నోచుకోలేదు. ఈవీఎంలు విడిచి పెట్టి మధ్యలో భోజనం చేయడానికి సాససించలేకపోయారు. ఆఖరుకు 14వ తేదీ మధ్యాహ్నం వరకూ స్ట్రాంగ్‌రూమ్‌ వద్దే ఉండాల్సి వచ్చింది. దాదాపు మూడు రోజుల పాటు వారు విధులు నిర్వహించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఇలా..

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అనేక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల తాగునీరు, భోజనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. దీంతో పోలింగ్‌ ముందు రోజు రాత్రి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన సిబ్బందికి ఇక్కట్లు తప్పలేదు. నేలపైనే పడుకోవాల్సి వచ్చింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మరుగుదొడ్లు ఉన్నా.. రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. మరోవైపు 13వ తేదీ రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగగా.. తినడానికి సరైన ఆహారం లేక వారు ఆకలితో విధులు నిర్వహించాల్సి వచ్చింది. మొత్తంగా సమస్యల నడుమే సిబ్బంది విధులు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు వారికి సహకరించారు. భోజనాలు, తాగునీరు అందించారు. ఇదిలా ఉండగా రవాణా సదుపాయం లేని పోలింగ్‌ కేంద్రాలకు బస్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే వాటిల్లో సిబ్బంది అతికష్టం మీద పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాల్సి వచ్చింది. పోలింగ్‌ జాప్యం జరిగిన కేంద్రాల సిబ్బంది ఆకలితో అలమటించారు.

రెమ్యూనరేషన్‌ చెల్లింపుల్లో వ్యత్యాసం

ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్‌ చెల్లింపుల్లో తేడా ఉండడంతో ఉద్యోగులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఇతర జిల్లాలతో పోల్చితే రెమ్యూనరేషన్‌ తక్కువగా ఇచ్చారని పలువురు పోలింగ్‌ సిబ్బంది చెబుతున్నారు. కొన్నిచోట్ల పీవోకు రూ. 1750, ఏపీవోకు రూ. 1250లు, ఓపీవోలకు రూ. 500లు చొప్పున అందించారు. మరికొన్ని ప్రాంతాల్లో పీవోకు రూ. 2050లు, ఏపీవోకు రూ. 1550లు, ఓపీవోలకు రూ.1050లు చొప్పున అందించారు. ఒక్కో చోట ఒక్కో విధంగా చెల్లింపులేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిని వెంటనే సరిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇన్‌చార్జి డీఆర్వోకు ఫిర్యాదు

రెమ్యూనరేషన్‌ చెల్లింపుల్లో తేడాలను యూటీఎఫ్‌ జిల్లా శాఖ నాయకులు గురువారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి డీఆర్వో కేశవనాయుడుకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన రిటర్నింగ్‌ అధికారులకు ఫోన్‌ చేసి తేడాలను సవరించాలని ఆదేశాలిచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో రిజర్వ్‌లో ఉన్న ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యూనరేషన్‌ చెల్లించాలన్నారు. పీవో, ఏపీవోలుగా రిజర్వ్‌లో ఉన్నవారికి ఓపీవో డ్యూటీ వేసిన వారికి ట్రైనింగ్‌ డబ్బులు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదనంగా ట్రైనింగ్‌ ఇచ్చిన వారికి కూడా చెల్లిస్తామన్నారు. ఆర్‌వోలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. డ్యూటీ సర్టిఫికెట్స్‌ వెంటనే ఇచ్చేటట్లు చూస్తామన్నారు. పీవో, ఏపీవోలకు సమానంగా రెమ్యూనరేషన్‌ చెల్లించాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహన్‌రావులు విన్నవించగా క్లారిఫికేషన్‌ తీసుకుంటామని ఇన్‌చార్జి డీఆర్వో తెలిపారు.

పలుచోట్ల ఇలా..

- సీతంపేట: సీతంపేట మండలంలో పలుచోట్ల ఫోన్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బందికి ఇక్కట్లు తప్పలేదు. ఈనెల 12వ తేదీ సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నప్పటి నుంచి 13వ తేదీ రాత్రి పోలింగ్‌ ముగిసేవరకు వారి ఫోన్లకు సిగ్నల్స్‌ లేవు. దీంతో వారు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలో 105 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వీటిలో 37 పోలింగ్‌ కేంద్రాలకు పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ సౌకర్యం లేదు. ఇవన్నీ కొండశిఖర గ్రామాలు కావడంతో సిగ్నల్‌ సమస్య వేధించింది. మరోవైపు తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని పోలింగ్‌ కేం ద్రాలు ఇరుకుగా ఉండగా, భోజనం, తాగునీరు, మరుగు దొడ్ల సౌకర్యాలు కూడా కరువయ్యాయి. మరికొన్నిచోట్ల గ్రామ సర్పంచ్‌లు పోలింగ్‌ సిబ్బందికి భోజన సౌకర్యాలు కల్పించారు.

- పాలకొండ: నియోజకవర్గంలో పలుచోట్ల పోలింగ్‌ సిబ్బంది చీకట్లోనే విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 9 గంటలైనా కరెంట్‌ రాలేదు. దీంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. సెల్‌ఫోన్‌ లైట్లు, టార్చిలైట్ల వెలుతురులోనే విధులు నిర్వహించాల్సి వచ్చింది. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో సిబ్బంది నానా అవస్థలు పడ్డారు.

- గరుగుబిల్లి : మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసినా.. సక్రమంగా మెనూ అమలు కాలేదు. మరోవైపు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లకు రూ.5 వేలు మేర అందించాల్సి ఉండగా రూ.2 వేలు అందించి చేతులు దులుపుకున్నారు. కేంద్రాల పరిధిలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి అవసరాలకు రూ. 3 వేలుకు గాను రూ.2 వేలు చొప్పున బీఎల్‌వోలకు అందించి మమా అనిపించారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించిన వారు అష్టకష్టాలు పడ్డారు. ఈవీఎంలతో స్ర్టాంగ్‌ రూములకు బయల్దేరిన సిబ్బందికి ఒకవైపు విద్యుత్‌ కోత, మరోవైపు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.

- సాలూరు రూరల్‌: సాలూరు నియోజకవర్గంలో కురుకూటి, పాంచాళి, కూర్మరాజుపేట, చిన్నవీధి, గుమడాంల్లో రాత్రి పది వరకు ఓటింగ్‌ జరిగింది. అయితే సరైన వెలుతురు లేకపోవడంతో సిబ్బంది, ఓటర్లకు అవస్థలు తప్పలేదు. పోలింగ్‌ ముందు రోజు రాత్రి దోమల బెడదతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వారికి అందించిన భోజనాల్లో నాణ్యత లోపించింది. మెనూ కూడా సక్రమంగా అమలు కాలేదు. దీనికి తోడు సాలూరు పోలింగ్‌ కేంద్రాల నుంచి నేరుగా ఉల్లిభద్రలో కౌంటింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు అప్పగించాలనే నిబంధన పీవో,ఏపీవోలకు నరకప్రాయంగా మారింది. ఉల్లిభద్ర రోడ్డుకు 13వ తేదీ రాత్రి పది గంటలకు చేరిన వాహనాలు కాలేజీ ఆవరణలోకి వెళ్లే సరికి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలైంది. మరికొన్ని వాహనాలు ఉదయం 11 గంటలకు చేరాయి. పోలింగ్‌ సిబ్బందికి రాత్రి భోజనం, నిద్ర లేకుండా పోయింది.

వ్యత్యాసం ఎందుకు?

ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి రెమ్యూనరేషన్‌ చెల్లింపు విషయంలో వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. ఒక్కో చోట ఒక్కోలా చెల్లింపులుంటాయా? ఈ వత్యాసాన్ని సరిచేసి సిబ్బందికి న్యాయం చేయాలి. దీనిపై కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నిబంధనలు ప్రకారం అందరికీ రెమ్యూనరేషన్‌ చెల్లించాలి.

- అమరాపు సూర్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్‌టీయూ అసోసియేట్‌, పార్వతీపురం

Updated Date - May 16 , 2024 | 11:39 PM