Share News

ఈ పాపం సర్కారుదే

ABN , Publish Date - May 03 , 2024 | 12:36 AM

‘గత నెల సచివాలయాల్లో పింఛను తీసుకున్నాం. ఈసారి అలా ఎందుకు ఇవ్వలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే సర్కారు పింఛన్‌ డబ్బులను బ్యాంకు ఖాతాలో వేసింది. ఎండలో అలసిసొలసి వెళ్తే బ్యాంకు సిబ్బంది జిరాక్స్‌ కాపీల కోసం పదేపదే తిప్పారు.

ఈ పాపం సర్కారుదే
గంట్యాడ : కొటారుబిల్లి కూడలిలో బీసీ పాయింట్‌ వద్ద వృద్ధు నిరీక్షణ

ఈ పాపం సర్కారుదే

బ్యాంకు అకౌంట్‌లో పింఛను వేస్తే ఎలా?

సర్వీసుల పేరుతో కట్‌ చేస్తున్నారు..

మండుటెండలో వెళ్లి క్యూలో నిల్చున్నాము

బ్యాంకు సిబ్బంది జిరాక్స్‌లు అడుగుతున్నారు

గోడు వెళ్లబోసుకుంటున్న పింఛన్‌దారులు

‘గత నెల సచివాలయాల్లో పింఛను తీసుకున్నాం. ఈసారి అలా ఎందుకు ఇవ్వలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే సర్కారు పింఛన్‌ డబ్బులను బ్యాంకు ఖాతాలో వేసింది. ఎండలో అలసిసొలసి వెళ్తే బ్యాంకు సిబ్బంది జిరాక్స్‌ కాపీల కోసం పదేపదే తిప్పారు. అంతా అయ్యాక సర్వీసు చార్జీల కోసం కొంత డబ్బులకు కోత పెట్టారు. పింఛనే ఆధారంగా బతుకుతున్న మేము ఈ నెల ఎలా నెట్టుకొచ్చేది’ అంటూ వృద్ధులు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరిని కదిపినా కన్నీరుపెడుతూ తమ కష్టాలను విన్నవించారు. ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను ఈసారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో వాటిని తీసుకునేందుకు వృద్ధులు నరకం చూస్తున్నారు. మండుటెండల్లో బ్యాంకులకు బయలుదేరుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఖాతాలో డబ్బులు పడలేదని.. బయోమెట్రిక్‌ పడడం లేదని... సర్వర్‌ పనిచేయడం లేదని, విత్‌డ్రా ఫాం సరిగా నింపలేదని ఇలా వివిధ రూపాల్లో గురువారం అవస్థలు పడ్డారు.

భోగాపురం/ గజపతినగరం/ శృంగవరపుకోట/రేగిడి/ గంట్యాడ/ బొబ్బిలి/ రామభద్రపురం, మే 2:

జిల్లాలో గురువారం ఏ బ్యాంకు వద్ద చూసినా పింఛనుదారుల అవస్థలే కనిపించాయి. బారులుతీరిన క్యూలు.. నిల్చోలేక ఉన్నచోటే నిరీక్షించిన వృద్ధులు.. విత్‌డ్రాఫాం నింపలేక వారిని వీరిని ప్రాధేయపడడం.. సర్వీసుల పేరుతో డబ్బులకు కోత పడిన వారు ఆవేదనతో తిరుగుముఖం పడడం తదితర దృశ్యాలు ప్రస్ఫుటమయ్యాయి. పింఛన్‌ లబ్ధిదారులు ఎండను భరిస్తూ బ్యాంకులకు క్యూ కట్టారు. అక్కడికి వెళ్లాక ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చేదు అనుభవం ఎదురైంది. ఖాతా రన్నింగులో లేదని, కేవైసీ చేయించుకోవాలని, ఆధార్‌ లింకు కాలేదని, ఆధార్‌కు వేరే బ్యాంకుఖాతా లింకై ఉందని... బ్యాంకుల సిబ్బంది చెప్పడంతో పింఛన్‌దారులు ఇదెక్కడి అన్యాయమంటూ గగ్గోలుపెట్టారు. ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెట్టడం బాగాలేదని వారంతా నిట్టూర్చారు. కొంతమంది పెన్సన్‌దారులకు చేతికి పైసా అందకుండా మొత్తం నగదు బాంకులోనే కట్‌ అయిపోతోంది. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా ఏటీఎం చార్జీలు, ఎస్‌ఎంఎస్‌ చార్జీలు, మెంటైనెన్స్‌, ఇతరత్రా చార్జీలు తమ ప్రమేయం లేకుండా కట్‌ అయిపోతాయన్నారు. ఈ ప్రక్రియ బ్యాంకు నిబంధనల ప్రకారమే జరుగుతోందని సమాధానం ఇవ్వడంతో పాపం పింఛనుదారులు చేసేదిలేక నిరాశతో ఇంటిబాట పట్టారు.

ప్రతిపక్షంపై నెడుతున్న వైసీపీ

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం లబ్ధిపొందేందుకు హింసిస్తోందని వృద్ధులు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత కల్పించే బుద్ధితో ఇలా చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు. ఇంటింటికీ పింఛన్‌లను పంపిణీ చేయకుండా వలంటీర్లను టీడీపీ అడ్డుకుందంటున్నారు. అయితే వైసీపీ ప్రలోభాన్ని కనిపెట్టిన ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకోని వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ వద్దని ఆదేశించింది. ఇదే అవకాశంగా వైసీపీ ప్రభుత్వం పింఛన్‌దారులను అవస్థలకు గురిచేస్తున్నారు. ఈ నెపాన్ని ప్రతిపక్షంపై నెడుతున్నారు.

డబ్బులన్నీ తీసుకున్నారు..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతా ఉంది. దాంట్లో జమ అయిన పింఛను తెచ్చుకోవాలని బ్యాంకుకు వెళ్లాను. విత్‌డ్రా ఫాం రాసి ఇవ్వగా ఖాతాలో బ్యాలెన్స్‌ లేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఎందుకని ప్రశ్నించగా ఏటీఎం, ఎస్‌ఎం ఎస్‌, మెంటైనెన్స్‌ చార్జీలు ఖాతా నుంచి కటింగ్‌ అయి ఉండొచ్చునన్నారు. చేసేదిలేక వెనుతిరిగాను. పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నాను. ఈనెల ఇబ్బందులు పడాల్సిందేనా. ప్రభుత్వం ఇలా చేయడం చాలా అన్యాయం.

పుస్తకం పనిచేయదట

నా బ్యాంక్‌ పుస్తకం మార్చాలని.. పింఛన్‌ పడలేదని చెప్పారు. దత్తిరాజేరు మండలం నుంచి ఆటో కట్టించుకొని వచ్చాను. ఆధార్‌ కార్డు, ఫొటో పట్టుకొని రేపు రమ్మంటున్నారు. ఇలా బ్యాంక్‌కు రోజూ తిరగాలంటే కష్టంగా ఉంది. ఎండలు మండిపోతున్నాయి.

- చుక్క రామునాయుడు, చినకాద, దత్తిరాజేరు మండలం

ఈ బ్యాంక్‌ కాదంటున్నారు

జిన్నాం గ్రామం నుంచి కె.యస్‌ఆర్‌ పురంలోని బ్యాంక్‌కు వచ్చాను. పింఛను ఇక్కడ కాదు జిన్నాం వెళ్లి అక్కడున్న బ్యాంక్‌లో తీసుకోవాలని చెప్పారు. అక్కడ అడిగితే కెయస్‌ఆర్‌ పురం వెళ్లాలని చెప్పారు. ఇంతకీ నాకు పింఛన్‌ ఎక్కడ ఇస్తారో అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు.

- మిత్తిరెడ్డి అప్పయ్యమ్మ, జిన్నాం, గపపతినగరం

-----------

ఇదెక్కడి చిక్కు

నాకు స్టేట్‌బ్యాంకులో డబ్బులు వేసారని తెలిసి ఉదయమే వచ్చాను. మధ్యాహ్నం అయినా ఇంతవరకు నా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే మిషన్‌ పోయిందని, అందుకే ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. ఇదెక్కడి చిక్కు వచ్చింది.

- రాములమ్మ, కంచరవీధి, బొబ్బిలి

Updated Date - May 03 , 2024 | 12:36 AM