దాహం..దాహం..
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:10 AM
వేసవి ఇంకా పూర్తిగా రాకముందే జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పట్టణంలో 30 వార్డులకు కొన్ని నెలలుగా మూడు , నాలుగు రోజుల కొకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బిందెడు నీటి కోసం పరుగులు
వేసవి ఇంకా పూర్తిగా రాకముందే పట్టణవాసులకు తప్పని అవస్థలు
కానరాని ముందస్తు ప్రణాళికలు
సమగ్ర రక్షిత పథకం కాగితాలకే పరిమితం
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
(పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 29)
వేసవి ఇంకా పూర్తిగా రాకముందే జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పట్టణంలో 30 వార్డులకు కొన్ని నెలలుగా మూడు , నాలుగు రోజుల కొకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటి కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మండు వేసవిలో తమ పరిస్థితేమిటోనని జిల్లాకేంద్రవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రజల తాగునీటి కష్టాలను పట్టించుకునే వారే కరువయ్యారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రణాళికలు కాగితాలకే పరిమితం కావడంతో పట్టణవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మున్సిపాల్టీ 1959లో ఏర్పడగా.. నాటి నుంచి గరుగుబిల్లి మండలం తోటపలి వద్ద నాగావళి నది నుంచి జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరా చేస్తున్నారు. అప్పటి పట్టణ జనాభా 10 వేల నుంచి 15 వేల మంది ఉండేవారు. జిల్లా కేంద్రం గా ఏర్పడిన తరువాత ప్రస్తుత పట్టణ జనాభా 2012 అధికార లెక్కల ప్రకారం 55 వేల 550 మంది . అయితే అనధికారికంగా చూస్తే.. 75 వేల నుంచి 80 వేల మంది వరకు ఉంటారనేది కాదనలేని వాస్తవం. ఇకపోతే జిల్లా కేంద్రం శివారుల్లో పుట్టగొడుగుల్లా కాలనీలు ఏర్పడుతుండగా.. తాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా ఫలితం లేకుండా పోయింది.
నీటిని మళ్లించడంలో అలసత్వం..
మున్సిపాల్టీ ఏర్పడిన తొలినాళ్లలో నాగావళి నది నుంచి పట్టణానికి తాగునీటి సరఫరా చేయడం ఇంజనీరింగ్ అధికారులకు చాలా సులభంగా ఉండేది. అప్పట్లో నాగావళి నదికి 20 నుంచి 30 మీటర్ల పరిధిలో రెండు ఇన్‌ఫిల్టర్ బావులను ఇ నిర్మించారు. 1990 దశకంలో పట్టణ జనాభా పెరుగుతుండడంతో నదికి మరో 30 నుంచి 40 అడుగుల దూరంలో మరో రెండు ఇన్‌ఫిల్టర్ బావులను నిర్మించారు. అయితే వాటి నిర్మాణంలో అధికారులు చేసిన చిన్న చిన్న తప్పిదాలే.. నేడు పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు కారణమవుతున్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కూడా నాగావళి నది నీటిని ఇన్‌ఫిల్టర్ బావులకు మళ్లించడంలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపించకపోవడం విచారకరం. నదిలో ఉన్న మొదటి ఇన్‌ఫిల్టర్ బావిలో 17.5 హెచ్‌పీ మోటారు, రెండో ఇన్‌ఫిల్టర్ బావిలో 7.5 హెచ్‌పీ మెటారు తోనే ప్రధాన పంప్ హౌస్ నుంచి బూస్ట్టర్ పంప్ హౌస్‌కు.. అక్కడ నుంచి పట్టణంలోని ఐదు రక్షిత పథకాలకు నీటిని మళ్లిస్తున్నారు. వాటి ద్వారానే 30 వార్డులకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. కాగా నదిలో ఉన్న మూడో ఇన్‌ఫిల్టర్ బావిలో 10 హెచ్‌పీ 2 మోటార్లు, నాలుగో ఇన్‌ఫిల్టర్ బావిలో 5 హెచ్‌పీ మెటారు ఏర్పాటు చేసినా ప్రధాన పంప్‌హౌస్‌కు అరకొరగా నీటి సరఫరా జరుగుతుందనే చెప్పాలి. తాగునీటి సరఫరాలో ఇప్పటికీ ఎలాంటి మార్పురాలేదనే చెప్పొచ్చు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రధాన పంప్‌హౌస్ వద్ద సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే జనరేటర్‌ను కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం దాని నిర్వహణ బాధ్యతలు చూసే వారు లేకపోవడంతో అది మూలకు చేరింది.
జనాభా పెరుగుతున్నా ప్రణాళికలు ఏవీ..?
జిల్లాకేంద్రం.. పార్వతీపురం మున్సిపాల్టీలో రోజురోజుకూ జనాభా పెరుగుతున్నా.. ఇందుకు తగ్గట్టుగా తాగునీటి సరఫరాకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. జిల్లా కేంద్రం ఏర్పడి మూడేళ్లవుతున్నా.. ఇప్పటికీ తోటపల్లి నాగావళి నది నుంచి పట్టణానికి నీటిని మళ్లించడానికి రెండు 75 హెచ్‌పీ మోటార్లనే వాడుతున్నారు. బూస్టర్ పంప్‌హౌస్ వద్ద ఒకే ఒక్క 100 హెచ్‌పీ మోటారును వినియోగిస్తూ.. పట్టణంలోని 5 రక్షిత పథకాల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత జనాభా సుమారు 80 వేలకు పైగానే ఉండగా.. రోజుకు 5 లక్షల లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. కానీ బెలగాంలోని రెండు, జగన్నాఽథపురం, కొత్తవలస, మున్సిపల్ కార్యాలయంలోని రక్షిత పథకాల నుంచి రోజుకు 5 లక్షల లీటర్ల కంటే తక్కువగానే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణవాసులకు నాలుగైదు రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందుతోంది. వాటర్ ట్యాంకర్లు కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. శివారు ప్రాంతకాలనీలకు పాంతాలకు రోజు తప్పించి రోజు అవి చేరుతున్నప్పటికీ జిల్లాకేంద్రవాసుల దాహార్తి తీరడం లేదు. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా.. ఉంటే ఇక మండు వేసవిలో పరిస్థితేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సాగని సమగ్ర తాగునీటి పథకం పనులు
గత టీడీపీ ప్రభుత్వం సంపూర్ణ తాగునీటి పథకానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించింది. అయితే ఇంతలో ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. 2019లో వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ దానిపై దృష్టి సారించలేదు. కాగా రెండేళ్ల కిందట ఎంతో అట్టహాసంగా రూ.63.63 కోట్లతో సమగ్ర తాగునీటి పథకానికి శిలాఫలకాన్ని మాత్రం ఆవిష్కరించారు. పనుల్లో మాత్రం ఎటువంటి కదలిక లేదు. తోటపల్లి ప్రధాన పంప్‌హౌస్ నుంచి పట్టణానికి తాగునీటి సరఫరా చేసే పైపులు గత రెండేళ్లుగా గరుగుబిల్లి మండల ఉల్లిభద్ర సమీపంలోనే వృఽథాగా పడి ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సమగ్ర తాగునీటి పథకం కాగితాలకే పరిమితమైందని చెప్పొచ్చు. మరోవైపు పట్టణంలో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలిసినప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు.
పరిష్కారానికి చర్యలు
పార్వతీపురం మున్సిపాల్టీలో ఈ వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. నాగావళి నదిలోని నీటిని ఇన్‌ఫిల్టర్ బావులకు తరలించే విధంగా ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశాం. త్వరలోనే సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.
- కిరణ్, ఇన్‌చార్జ్ కమిషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ