వైసీపీ జెండాను పీకేశారు
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:22 AM
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని పొనుగుటివలస గ్రామంలో కొంతమంది యువతతో పాటు గ్రామస్థులు వైసీపీ జెండాను పీకి పక్కన పడేశారు.
రాజాం రూరల్, జనవరి 12: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని పొనుగుటివలస గ్రామంలో కొంతమంది యువతతో పాటు గ్రామస్థులు వైసీపీ జెండాను పీకి పక్కన పడేశారు. ఆపార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్‌తో పాటు రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు తదితర నాయకులను అడ్డుకుని సమస్యలపై నిలదీశారు. గ్రామంలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు పాలవలస శ్రీనివాసరావు తదితర నాయకులు ప్రయత్నించినా యువత అంగీకరించలేదు. దీంతో అర్ధాంతరంగా నాయకులు గ్రామాన్ని విడచిపెట్టాల్సి వచ్చింది. ‘జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి అధికారపార్టీ నాయకులు గ్రామానికి వచ్చినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎదురు తిరిగిన యువత
గ్రామానికి చెందిన కొందరు యువకులు వైసీపీ నాయకులకు ఎదురుతిరిగారు. పార్టీకోసం కష్టబడి పనిచేశామని, ఎమ్మెల్యే గెలుపు కోసం చాలా శ్రమించామని అయినా తమకు, తమ గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాల సభ్యులు రూ.లక్షల్లో నష్టపోయారని, నిధులు ఆర్పీలు స్వాహా చేస్తే కార్యాలయాలు, బ్యాంకులు, పొలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా ఒక్కరు కూడా సహాయం చేయలేదని మరికొందరు నిలదీశారు. రఽగామానికి మంజూరైన పింఛన్లను రద్దు చేశారని కొందరు నిలదీశారు. గ్రామంలో రైతుబరోసా కేంద్రం ఎందుకు నిర్మించలేదన్న యువత ప్రశ్నకు రేపు వస్తే ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దామని పాలవలస శ్రీనివాసరావు చెప్పేందుకు చేసిన ప్రయత్నాలను యువత అడ్డుకున్నారు. ‘ఇంకెప్పుడు చేస్తారు.. మరో మూడు నెలల్లో ప్రభుత్వమే పోతుంది. ఇంకేం చేస్తార’ంటూ కేకలు వేశారు. గ్రామంలో జెండా ఎగురవేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశం పెట్టొద్దని, గ్రామం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. జెండా ఎగురవేయకుండానే జెండా కర్రను పీకేసి పక్కన వడవేశారు. దీంతో వైసీపీ నాయకులు కొద్దిసేపు గ్రామంలో ఉండి వెనక్కి వెళ్లిపోయారు.