Share News

తిరిగొచ్చాయ్‌..

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:53 PM

కొమరాడ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా సంచరించిన ఏనుగులు గురుగుబిల్లి మండలానికి తిరిగొచ్చాయి. గురువారం అర్ధరాత్రి తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న నందివానివలస ప్రాంతంలో అవి దర్శనమిచ్చాయి.

  తిరిగొచ్చాయ్‌..
నందివానివలస రైస్‌ మిల్లు ఆవరణలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

గరుగుబిల్లి, జూన్‌ 7 : కొమరాడ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా సంచరించిన ఏనుగులు గురుగుబిల్లి మండలానికి తిరిగొచ్చాయి. గురువారం అర్ధరాత్రి తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న నందివానివలస ప్రాంతంలో అవి దర్శనమిచ్చాయి. రహదారికి ఆనుకుని ఉన్న రైస్‌ మిల్లులోని ధాన్యంతో పాటు పలు సామగ్రిని ధ్వంసం చేశాయి. రహదారికి ఆనుకుని గజరాజులు సంచరించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొద్ది రోజుల కిందట గిజబ, నందివానివలస, సంతోషపురం, ఖడ్గవలస, సుంకి, మరుపెంట, పిట్టలమెట్టతో పాటు పలు గ్రామాల్లో సంచరించిన ఏనుగులు కొమరాడ మండలానికి పయనమయ్యాయి. అయితే మళ్లీ అవి ఈ ప్రాంతానికి చేరుకోవడంతో పరిసర గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. సంచరించిన మార్గాల్లోనే తిరుగుతూ పలు పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాల్లో సంచరిస్తూ, పగలు నాగావళి నదిలో తిష్ఠ వేస్తున్నాయి. సంబంధిత అటవీశాఖ అధికారులు దృష్టి సారించి.. గజరాజులు గ్రామాల్లోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. వాటి కారణంగా నష్టం వాటిల్లిన పంటలకు నేటికీ ఎటువంటి పరిహారం అందించలేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:53 PM