Share News

సిగ్నల్స్‌ ఉండవు.. ఫోన్లు పనిచేయవు..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:34 PM

జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలకు నెట్‌వర్క్‌ సౌకర్యం ఉండడం లేదు. దీంతో సెల్‌ ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదు. సిగ్నల్స్‌ కోసం గిరిజనులు కొండలు.. గుట్టలు ఎక్కి దిగాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నడిచి.. సిగ్నల్స్‌ ఉన్న చోటకు చేరుకోవాల్సి వస్తోంది. పింఛన్లు, రేషన్‌ సరుకులు అందుకునే సమయంలోనే కాదు.. ఆధార్‌ కార్డులు తదితర వాటిని పొందాలన్నా.. నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

సిగ్నల్స్‌ ఉండవు..  ఫోన్లు పనిచేయవు..
వలగజ్జి గ్రామంలో కొండెక్కి సెల్‌ సిగ్నల్స్‌ కోసం ఎదురుచూస్తున్న గిరిజన యువతి

పూర్తవ్వని సెల్‌టవర్ల నిర్మాణం

వాటిపై దృష్టి సారించని గత వైసీపీ సర్కారు

నెట్‌వర్క్‌ సౌకర్యానికి దూరంగా గిరిజన గ్రామాలు

పింఛన్లు, రేషన్‌ సరుకుల పంపిణీకి ఇబ్బందులు

గిరిజనులకు తప్పని అవస్థలు

నూతన ప్రభుత్వంపై ఆశలు

సీతంపేట: జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలకు నెట్‌వర్క్‌ సౌకర్యం ఉండడం లేదు. దీంతో సెల్‌ ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదు. సిగ్నల్స్‌ కోసం గిరిజనులు కొండలు.. గుట్టలు ఎక్కి దిగాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నడిచి.. సిగ్నల్స్‌ ఉన్న చోటకు చేరుకోవాల్సి వస్తోంది. పింఛన్లు, రేషన్‌ సరుకులు అందుకునే సమయంలోనే కాదు.. ఆధార్‌ కార్డులు తదితర వాటిని పొందాలన్నా.. నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. గత వైసీపీ సర్కారు ప్రభుత్వమైతే.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సౌకర్యం కల్పనకు కనీస చర్యలు తీసుకోలేదు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 64 సెల్‌ టవర్లును మంజూరు చేశారు. వాటికి అవసరమైన స్థల సేకరణ బాధ్యతను ఐటీడీఏలకు అప్పగించారు. ఈ సెల్‌ టవర్ల నిర్మాణానికి ట్రైకార్‌ నిధులు మంజూరు చేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులకు బ్రేక్‌ పడింది. ఇంతవరకు సెల్‌టవర్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్నింటి నిర్మాణాలు పూర్తయినా.. వాటికి అవసరమైన సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల వృథాగా పడి ఉన్నాయి. దీంతో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ ఉండడం లేదు. అత్యవసర వేళల్లో గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కోసం కొండలు, చెట్లు ఎక్కాల్సి వస్తోంది. రేషన్‌ సరుకులు, పింఛన్లు , విద్యార్థుల బయోమెట్రిక్‌, ఉద్యోగులు ఫేస్‌యాప్‌ వంటి ఆన్‌లైన్‌ సర్వీసులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆన్‌లైన్‌ సేవలు పొందాలంటే.. సిగ్నల్స్‌ వచ్చిన ప్రాంతానికి ఉద్యోగులు, గిరిజనులు తరలివెళ్లాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా సిగ్నల్స్‌ లేక పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేషన్‌ సరుకులకు సంబంధించి 23 స్టాక్‌ పాయింట్లు ఉన్నప్పటికీ.. వాటిల్లో ఎనిమిది స్టాక్‌ పాయింట్లకు సెల్‌ సిగ్నల్స్‌ లేవు. దీంతో ప్రతినెలా బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. రెండు నెలలకు ఒకసారి స్లిప్పులు ఇచ్చి రైస్‌ సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది. గుమ్మలక్ష్మీపురం మండల పరిధిలో ఉన్న కలిటి గ్రామంలో ఆరు నెలల కిందట సెల్‌ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే మిగతా అన్ని సెల్‌ టవర్లు అందుబాటులోకి తీసుకొస్తాయని అధికారులు చెప్పినప్పటికీ.. జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఇంతవరకు సెల్‌ టవర్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఏజెన్సీలో నెట్‌వర్క్‌ సమస్యను గిరిజన సంఘం నాయకులతో పాటు మన్యం ప్రగతి చైర్మన్‌ గేదెల రవి తదితరులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెల్‌టవర్‌ పనులు త్వరితగతిన పూర్తవుతాయని, నెట్‌వర్క్‌ సమస్య తొలగిపోతుందని వారు భావిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఫోన్‌ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెండు కిలోమీటర్లు నడిచి సెల్‌ సిగ్నల్స్‌ ఉన్న చోటకు వెళ్లాల్సి వస్తోంది.

- సవర మంగయ్య, చాపరాయిగూడ

========================

ప్రతి నెలా ఇంతే..

రేషన్‌ సరుకుల కోసం ప్రతినెలా కొండ కింద గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. మా గ్రామంలో సెల్‌ సిగ్నల్స్‌ ఉండడం లేదు. దీంతో ప్రతినెలా ఈ అవస్థలు తప్పడం లేదు.

- సవర కువ్వారి, రంగంవలస

Updated Date - Jul 05 , 2024 | 11:34 PM