Share News

వెనక్కి తగ్గేదే లేదు!

ABN , Publish Date - Jan 22 , 2024 | 12:35 AM

తమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని 41 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు ఆదివారం ‘చలో విజయవాడ’కు పయనమయ్యారు. సీఎం జగన్‌కు తమ నిరసన స్వరం వినిపించాలని పెద్దఎత్తున జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా కార్యకర్తలు, సంఘ ప్రతినిధులు తరలివెళ్లారు.

వెనక్కి తగ్గేదే లేదు!
విజయనగరం రైల్వేస్టేషన్‌ వద్ద అంగన్‌వాడీలను అరెస్ట్‌చేసిన పోలీసులు

విజయనగరంలో అరెస్ట్‌

సర్కారు తీరుపై మండిపాటు

పార్వతీపురం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి)/ బెలగాం /పాలకొండ /సాలూరు/ గరుగుబిల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని 41 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు ఆదివారం ‘చలో విజయవాడ’కు పయనమయ్యారు. సీఎం జగన్‌కు తమ నిరసన స్వరం వినిపించాలని పెద్దఎత్తున జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా కార్యకర్తలు, సంఘ ప్రతినిధులు తరలివెళ్లారు. అయితే వారిని అడ్డుకోవాలని సంబంధిత పోలీస్‌ వర్గాలకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. కాగా ఆయా మండలాల పరిధిలో అంగన్‌వాడీ సంఘం ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. కొంతమంది అంగన్‌వాడీలు పలు మార్గాల్లో విజయవాడకు చేరుకొనే ప్రయత్నాలు చేశారు. కాగా సర్కారు తీరుపై వారు మండిపడుతున్నారు. నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నిర్బంధాలు, అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు.

విజయనగరంలో ....

చలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరిన జిల్లాకు చెందిన 19 మంది అంగన్‌వాడీలను విజయనగరం రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు-రాయగడ ప్యాసింజర్‌ రైలు ఎక్కబోతున్న వారిని పోలీసులు అరెస్టు చేసి విజయనగరం ఒకటో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యలను అంగన్‌వాడీలు, సీపీఎం నాయకులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమస్య లను పరిష్కరించకుండా అరెస్టులు చేయడం , ఉద్యోగాల నుంచి తొలగిస్తామని డెడ్‌లైన్‌ విధించడం దారుణమని అంగన్‌వాడీ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భయపడి తమను నిర్భందించి, అరెస్ట్‌ చేస్తోందని, అయితే ఇప్పటికే వేలాది మంది విజయవాడ చేరుకున్నారని వారు తెలిపారు. మహిళా శక్తి ఏమిటో ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలు చూస్తారన్నారు. ఎన్ని మార్గాల్లో అడ్డుకున్నా తాము వెనక్కు తగ్గబోమని తేల్చిచెప్పారు.

జిల్లాలో నిరసనలు..

సమ్మెలో భాగంగా ఆదివారం కూడా జిల్లాలో అంగన్‌వాడీలు నిరసనలు కొనసాగించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు మధ్యాహ్నం వేళ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం చలో విజయవాడకు బయల్దేరారు. సాలూరులో అంగన్‌వాడీలు ఆకులు తింటూ నిరసన తెలిపారు. పాలకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కళ్లు మూసుకుని నిరసన తెలిపారు. ఎస్మా, జీవో నెంబరు-2ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నోటీసులు, డెడ్‌లైన్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చిరుద్యోగులపై సీఎం జగన్‌ కర్కశంగా వ్యవహరించడం దారుణమన్నారు. తమను విధుల నుంచి తొలగిస్తామని మానసికంగా వేధించడం సరికాదన్నారు. సర్కారు దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ నిరసనలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ తదితరులు ఉన్నారు.

విధుల నుంచి తొలగిస్తాం

జిల్లాలో అంగన్‌వాడీలు సోమవారం నుంచి విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు వేచి చూశామని, విధుల్లో వెంటనే చేరాలని, లేకుంటే టెర్మినేషన్‌ నోటీసు అందిస్తామని పేర్కొన్నారు. పాతవారు విధుల్లో చేరకుంటే ఈ నెల 25న కొత్తవారి నియామకానికి నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. విధులకు హాజరు కాని కార్యకర్తలు 1,444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని ఐసీడీఎస్‌ పీవో ఎంఎన్‌ రాణి తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 12:35 AM